
ఎన్టీఆర్ జిల్లా కోడూరులో ఆధ్యాత్మిక శోభాయాత్ర కనులపండువగా జరిగింది. కోడూరు పాంచజన్య గీతాపారాయణ సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్, విశ్వహిందూ పరిషత్, భాస్యకార భక్త సమాజం ఆధ్వర్యంలో హిందూ ఆధ్యాత్మిక చైతన్య వేదిక ద్వారా శోభాయాత్ర సాగింది. స్థానిక టీటీడీ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కోడూరు ప్రధాన సెంటర్ వరకు సాగింది. భక్తులందరూ కాషాయ రంగుల జెండాలు ధరించి ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. భక్తి గీతాలకు అనుగుణంగా మహిళా భక్తమండళ్ల సభ్యులు శోభాయాత్ర ముందు కోలాట భజనలు చేస్తూ భక్తిభావం చాటుకున్నారు. కులాలకు, రాజకీయాలకు అతీతంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. మచిలీపట్నం, విజయవాడ, దివిసీమలోని ఆరు మండలాల భక్తులు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
ఆకట్టుకున్న వేంకటేశ్వరుడి మహాత్మ్యం నృత్యప్రదర్శన
కళాకారులు వేంకటేశ్వరస్వామికి సంబంధించి నిర్వహించిన నృత్యప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వర స్వామి వేషధారణలో కళాకారులు పలు అన్నమయ్య పాటలకు నృత్యాలు చేశారు. శ్రీరాముడి పట్టాభిషేకం, హనుమంతుడి మహాత్మ్యం వివరిస్తూ చిన్నారులు పలు ప్రదర్శనలిచ్చారు. ముందుగా నక్కవానిదారి, జరుగువానిపాలెం గ్రామానికి చెందిన భక్తమండళ్ల సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తిప్రపత్తులతో చేశారు.





