News

గురుకులం విద్యతో పాటు సంపూర్ణ జీవన విధానాన్ని బోధిస్తుంది : ఒడిశా గవర్నర్

235views

బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొంటూ అది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని ఉంగుటూరులో నివేదిత గురుకులం నూతన భవనం ప్రారంభోత్సవం, అదేవిధంగా ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ గురుకులం అనేది కేవలం విద్యను అందించే సంస్థ మాత్రమే కాదని, అది ఒక సంపూర్ణ జీవన విధానాన్ని బోధిస్తుందని, క్రమశిక్షణ, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు.

బాలికల విద్యకు అంకితమైన గురుకులం సామాజిక మార్పుకు శక్తివంతమైన కేంద్రంగా నిలుస్తుందన్నారు. బాలికల విద్యా అనేది ఒక అవకాశం కాదని, అది దేశ భవిష్యత్తును నిర్మించే మౌలిక అవసరమని బలంగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదిత గురుకులం పూర్తిగా బాలికల విద్యకే అంకితమై ఉండటం ఎంతో ప్రశంసనీయమన్నారు.

బాలికల విద్య దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఒక బాలిక విద్యను పొందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితే దేశం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు.

సిస్టర్ నివేదిత ఒక అసాధారణమైన మహనీయురాలు అని, ధైర్యం, అంకిత భావం, స్వార్థరహిత సేవ ఆమె జీవన తత్వానికి ప్రతిరూపాలని పేర్కొన్నారు. ఆమె పాశ్చాత్య దేశంలో జన్మించినప్పటికీ, భారతదేశాన్ని ఆమె తన ఆధ్యాత్మిక, సామాజిక కర్మభూమిగా స్వీకరించిందని, మహిళలు, బాలికల విద్య సాధికారతకు తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేశారని ఆమె సేవలను కొనియాడారు. మహిళలు విద్యావంతులై ఆత్మవిశ్వాసంతో తమ సాంస్కృతిక మూలాలతో అనుసంధానమై ఎదిగినప్పుడే నిజమైన జాతీయ పురోగతి సాధ్యమవుతుందని ఆమె దృఢంగా నమ్మారన్నారు.

విలువలతో కూడిన విద్య, సాంస్కృతిక చైతన్యం, సమాజ హితం కలిగిన విద్యను గురుకులం కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతి ఆధారంగా, ఆధునిక అవసరాలకు అనుగుణంగా విలువలతో కూడిన విద్యను అందిస్తున్న గురుకులం నిర్వహణ కమిటీ దూర దృష్టిని అభినందిస్తున్నానన్నారు. భారతీయ సంగీతం, యోగ, ధ్యానం, వేద పఠనం వంటి ప్రక్రియలను ఈ గురుకులం నుండి పొందిన విద్యార్థులు భవిష్యత్తులో భారతీయ సాంస్కృతిక రాయబారులుగా తయారవుతారని విశ్వసిస్తున్నానన్నారు.

గిరిజన ప్రజల్లో అత్యధికంగా ఉందని, అటువంటి వారిని అన్ని ప్రాంతాలలో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ప్రాథమిక విద్యకు బలమైన పునాది ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020ను తీసుకొచ్చిన సందర్భాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యోగార్దులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వారిగా విద్యార్థులను తయారు చేయడమే గురుకుల ముఖ్య బాధ్యతగా పెట్టుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో తొలుత విద్యార్థులు హోమం ప్రక్రియ నిర్వహించడంతో పాటు కోలాటం, యోగాసనాలు, యోగ చాప్, తాడు(రోప్)యోగ, సైకిల్ విన్యాసం, జడ కోలాటం, తదితర వ్యాయామ ప్రక్రియలు ప్రదర్శించారు. అదేవిధంగా కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.