
268views
సామాజిక సద్భావన (సామాజిక సమరసత) అనేది కొత్త భావనేమీ కాదని, భారతీయ సమాజంలో ఇది అత్యత స్వాభావికమైన గుణమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. సమాజం అంటే ఉమ్మడి లక్ష్యం వైపు సమష్టిగా ముందుకు సాగడమేనని ఆయన అభివర్ణించారు.
రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని భోపాల్ లోని కుశ్ భావు ఠాక్రే ఆడిటోరియంలో ‘‘సామాజిక సద్భావనా సమావేశం’’ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మోహన్ భాగవత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతికంగా, ఆధ్యాత్మికంగా సంతృప్తి చెందడంలోనే భారతీయ సమాజ జీవితం వుందన్నారు. సమాజంలోని ధర్మ శక్తులను జాగృతం చేయడం, అలాగే మన మన ప్రవర్తనల్లో పంచ పరివర్తన్ సాధన చేయడం, అలాగే సమరసత కోసం నిరంతర ప్రయత్నాలు చేయడం నేటి సమాజానికి అత్యంత ఆవశ్యకమని నొక్కి చెప్పారు.
ఎవరి విశ్వాసాలు, భాషలు, కులాలు అనేవి భిన్నభిన్నంగా వుండొచ్చు కానీ.. మనమందరమూ హిందువులమని, హిందూ అన్న గుర్తింపే అందర్నీ ఏకతాటిపైకి తెస్తుందని పునరుద్ఘాటించారు. అందరి పూర్వజులూ ఒక్కటేనని, అందరి సంస్కృతి, ధర్మం కూడా ఒక్కటేనన్నారు.
మన దేశంలో నాలుగు రకాల హిందువులు వుంటారని, అందులో మొదటి వారు ‘‘గర్వ్ సే కహో హమ్ హిందూ హై’’ అని అంటారని, రెండో వారు అందులో గర్వపడడానికి ఏముంది? మేము హిందువులం అని అంటారని, ఇక మూడో వారు.. బిగ్గరగా చెప్పకండి.. మా ఇంటికి వచ్చి చూడండి.. మేము హిందువులం’’ అని అంటారని, చివరగా నాలుగో వారు తాము హిందువులం అన్న భావనను మరిచిపోయిన వారు అని వివరించారు. అయితే.. ఎప్పుడైతే తాము హిందువులం అని మరిచిపోతారో అప్పుడు విపత్తు సంభవిస్తుందని, దీనికి ఉదాహరణగా చరిత్ర పుటలను పరికించి చూస్తే తెలిసిపోతుందన్నారు. అందుకే హిందువులను మేల్కొలిపి, సంఘటితం చేయడం అత్యంత అశ్యకమని వివరించారు.

ధర్మం అంటే మతం కాదని, ధర్మం అంటే ఆరాధనా పద్ధతి అని అన్నారు. ధర్మం అందర్నీ వెంట తీసకెళ్తుందని, అందర్నీ ఉద్ధరిస్తుందని వివరించారు.అలాగే శర్మం ఆనందాన్ని ఇస్తుందని, కర్తవ్యమే ధర్మమని అన్నారు.అలాగే ప్రతి ఒక్కరూ మరొకరితో సామరస్యపూర్వకంగా జీవించేలా నిగ్రహం చేసుకోవాలని, అది కూడా ధర్మమేనని అన్నారు. అయితే వారి వారి అభిరుచులు, స్వభావాల ప్రకారం అనేక మార్గాలు వున్నాయని, కానీ మనమందరమూ ఒకే గమ్య స్థానానికి చేరుకోవాలన్నారు. అయితే మానువులు మాత్రం తమ తమ స్వభావాలను బట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటారని తెలిపారు.
ఇతర సంస్థలతో సంఘ్ ని పోల్చలేం :
సంఘ్ గురించి ఈ మధ్య పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయని, అయితే ఒకర్ని అర్థం చేసుకోవడానికి ఇతరులతో పోల్చే సంప్రదాయం ఒకటి వుందన్నారు. అయితే.. సంఘ్ ని ఏ సంస్థతోనూ పోల్చలేమని, ప్రపంచంలోనే ఓ ప్రత్యేకమైన సంస్థ అని స్పష్టం చేశారు.అందుకే ఇతరులతో పోల్చడం ద్వారా సంఘ్ ను ఎప్పటికీ అర్థం చేసుకోలేమని, సంఘ్ గణవేశ ధరించి, పథ సంచలన్ చేస్తుంది కానీ.. అది పారామిలటరీ దళం కాదన్నారు. అలాగే సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుందని, అంత మాత్రాన సామాజిక సేవా సంస్థ అని భావించకూడదన్నారు. ఎవరికో ప్రతిస్పందనగా సంఘ్ కూడా ప్రారంభం కూడా కాలేదన్నారు. అయితే.. సమాజంలో ‘‘ఒత్తిడి తెచ్చే సంస్థ’’ గా వుండొద్దని సంఘ్ ప్రారంభంలోనే గట్టి నిర్ణయమైందని, యావత్ హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనే నిర్ణయించుకుందని గుర్తు చేశారు.

అలాగే ఉదాసీనత, వ్యతిరేకత సంఘ్ పై వున్నప్పటికీ సంఘ కార్యకర్తలు నిరాశలో పడిపోలేదని, భారతమాతపై అత్యంత భక్తి శ్రద్ధలను నింపుకొని సమాజంలో పనిచేశారన్నారు.ప్రపంచంలో సంఘ్ ఎదుర్కొన్న వ్యతిరేకత మరే సంస్థా ఎదుర్కోలేదన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ స్వయంసేవకులు అన్నింటినీ ఫణంా పెట్టి, సంఘ్ కార్యం కోసం పనిచేశారన్నారు.





