
మానవసేవయే మాధవసేవ కాదని, మాధవసేవగా సర్వప్రాణి సేవ జరగాలని త్రిదండి చినజియర్ స్వామి అన్నారు. పార్వతీపురం మన్యంజిల్లా సీతంపేట మండలం సీది గ్రామంలో మన్యప్రగతి సంస్థ ఆధ్వర్యంలో 3,500ల మందికిపైగా నిరుపేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతంకాదు ప్రధానం.. మానవత్వం ప్రధానం.. మానవత్వముంటే మనసు, బుద్ధి వికసిస్తే అప్పుడు మిగతా ప్రాణాలన్నీ మనవని భావించడం జరుగుతుంది. ప్రపంచమంతా నాది, కొండలు, కోనలు నదులు నావి అనే భావాన్ని పెంపొందించుకోవాలి… ఇది మనందరి సూత్రం కావాలి. మన్యం ప్రకృతిని కాపాడుకోవాలి. ఇక్కడ అత్యధికంగా పండించే జీడి, మామిడి, చింతపండు, పసుపు, అనాసపనస, ఇతర అటవీ ఉత్పత్తులు ఎంతో ఖ్యాతిని పొందాయి. మైదాన ప్రాంత వాసులు మీ పంటలపై ఆధారపడుతున్నారు. మీ వల్ల దేశమంతా బతుకుతున్నారు. అందుకే గిరిజనులందరికీ మంచి సౌకర్యాలు రావాలి.. మీ ఆందరి ఆరోగ్యాలు బాగుండాలని ఆకాంక్షించారు. పిల్లలను బాగా చదివించాలని పిలుపునిచ్చారు. మనబుద్ధిని పాశ్చాత్యదేశాలకు చెందిన వ్యక్తులు పాడుచేశారన్నారు. మనందరిలో… అన్ని వస్తువుల్లో దేవుడు ఉన్నారని తెలిపారు. చెట్లు, పక్షులు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడితే వాటికి హానితలపెడుతున్నామన్నారు. సంపదను దుబరా చేస్తున్నారన్నారు. కులం, మతం, జాతి, దైవాలు పేరు చెప్పి ఒకరినిఒకరు ఆక్రమించే ప్రయత్నం ఎన్నో రకాలుగా జరుగుతున్నాయ న్నారు. మనిషి తోటి మనిషికి తోడు పడుతున్నాడా అని ప్రశ్నించారు. దైవం మీద నమ్మకముంటే ఆ దైవాన్ని మనసులో పెట్టుకోవాలన్నారు. దైవం చూపిన మంచి మార్గంలో పది మందికి తోడు పడాలన్నారు. మనిషిని మార్చేసి ప్రలోభ పెట్టడం తగునా అని ప్రశ్నించారు.





