
బ్రిటన్ ప్రస్తుతం అమలు చేయదలచిన పౌరసత్వ చట్టాల ప్రకారం ఆ దేశంలో ఉన్న 90 లక్షల మంది ముస్లింలు పౌరసత్వం కోల్పోయే అవకాశాలు దండిగా ఉన్నాయి. వీళ్లందరినీ దేశం నుంచి పంపడం కూడా తప్పదు. దీనితో వాళ్లలో ఎక్కువ మంది భారత్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ల మీద పడే అవకాశం ఉందని, మరీ ఎక్కువగా భారత్లో ఆశ్రయం కోరతారని విశ్లేషకులు చెబుతున్నారు. 2022లో అక్కడ రూపొందించిన చట్టాల ప్రకారం ప్రభుత్వం ఎవరి పౌరసత్వాన్ని అయినా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రద్దు చేయవచ్చు. మరొక దేశ పౌరసత్వం ఉందని హోమశాఖ కార్యదర్శి విశ్వసిస్తే చాలు ఎవరి పౌరసత్వాన్ని అయినా రద్దు చేయవచ్చు. రన్నీమేడ్ ట్రస్ట్, రిప్రీవ్ అనే రెండు ప్రముఖ సంస్థలు ఇచ్చిన ఒక నివేదికలో ఇందుకు సంబంధించిన చాలా వివరాలు ఉన్నాయి. దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు చెందిన 90 లక్షల మంది పౌరులు ప్రస్తుత చట్టాలతో పౌరసత్వం కోల్పోయే అవకాశాలు ఎక్కువ అని ఆ నివేదిక తేల్చింది. ప్రస్తుతం బ్రిటన్ హోం కార్యదర్శిగా షబానా మహమ్మద్ అనే మహిళ ఉండడం విశేషం. వేరే దేశంతో వ్యక్తిగత బంధం లేకున్నా, పౌరసత్వం ఉందని తెలిస్తే బ్రిటన్ పౌరసత్వం పోతుంది. అంటే ఈ పద్ధతిలో 13 శాతం జనాభా బయటకు వెళ్లవలసి వస్తుంది. 2025లో ప్రారంభమైన ఒక చట్టం ప్రకారం ఎలాంటి నోటీసు లేకుండానే పౌరసత్వం రద్దు చేయవచ్చు. దీనిని కోర్టు ఆమోదించకపోయినా, పౌరసత్వం కోల్పోయిన వారి విన్నపాన్ని పరిశీలించిన తరువాత మాత్రమే పునరుద్ధరిస్తారు. కానీ ఈ ప్రక్రియకు ఏళ్ల కాలం పడుతుంది.





