News

సాంస్కృతిక మూలాలను బలోపేతం ద్వారా ‘‘స్వ’’ సాధ్యమవుతుంది : మోహన్ భాగవత్

287views

రాయ్ పూర్ వేదికగా విరాట్ హిందూ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కబీర్ పంత్ సన్యాస సంప్రదాయ అధిపతి సంత్ అసంగ్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గాయత్రీ పరివార్‌కు చెందిన ఊర్మిళ నేతమ్ కూడా విశిష్ట అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ..వందేళ్ల సంఘ ప్రయాణాన్ని నొక్కి చెప్పారు. సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయని వివరించారు. నాగపూర్ లోని ఓ చిన్న స్థలంలో సంఘ శాఖ ప్రారంభమై, నేడు దేశ వ్యాప్తంగా విస్తరించిందన్నారు.ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా అంటే.. కశ్మీర్ అయినా, మిజోరాం, అండమాన్, సిక్కిం, కచ్, ఉత్తరం, దక్షిణం, పశ్చిమం… ఇలా ఎక్కడికి వెళ్లినా.. అక్కడ స్వయంసేవకులు వున్నారని ప్రకటించారు.

హెడ్గేవార్ ఎంతో కృషి చేసి, సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారని, అప్పటి నుంచి పవిత్రమైన హిందూ ధర్మం, హిందూ సంస్కృతిని, సమాజాన్ని రక్షించడం ద్వారా హిందూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగ అనేక మంది స్వయంసేవకులు త్యాగం చేశారని, అలాగే వారి కృషి ద్వారా సంస్థ గణనీయంగా విస్తరించిందన్నారు.

హిందూ సమాజం నుంచి మనం ఆలోచిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ లో క్షీణిస్తున్న విలువలు, ఇలా అనేక విషయాలు కనిపిస్తాయన్నారు. ప్రతి రంగంలోనూ సవాళ్లు వుంటాయని, వాటి గురించి విస్తృతంగా చర్చించాలన్నారు. కేవలం చర్చించడమే కాదు, పరిష్కార మార్గం కూడా చూడాలని పిలుపునిచ్చారు.మన వ్యక్తిగత జీవితాల్లో లేదా దేశంలో మనం ఎదుర్కొనే సవాళ్లు ఏవైనా ఉన్నా, వాటికి పరిష్కారాలు మన వద్దనే ఉంటాయని అన్నారు.

మనం క్షేమంగా వుంటే ఏ సవాలు కూడా మనల్ని ఏమీ చేయలేదని,మన దేశం ఎంత పురాతనమైందో, అంతటి గొప్ప అభిప్రాయాలు, జ్ఞానం ఉందో సమాజం చూడాలని ఆయన అన్నారు. మనకు ఎల్లప్పుడూ సాధువుల సహవాసం లభిస్తూనే వుంటుందన్నారు.‘‘నేటి ఆధునిక సమాజంలో ఇంతటి గొప్ప సాధువులు ఏ ప్రపంచంలోనూ లేరు. కాబట్టి, సాధువు మాట వినడమే కాకుండా వారి అభిప్రాయాలను కూడా మనతో పాటు తీసుకెళ్లి, తదనుగుణంగా నడుచుకోవాలి’’ అని సూచించారు.

అంతేకాకుండా కుల వివక్షత, అంటరానితనాన్ని వదిలేయాని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో ఎవరినీ వారి కులం, సంపద, భాష ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చేయకూడదన్నారు. హిందూ సమాజం తమ మనస్సుల్లొంచి విభజన, వివక్ష అన్న భావనను పూర్తిగా నిర్మూలించేసుకోవాలన్నారు. హిందూ సమాజం ఐక్యంగా వుండి, పరస్పరంగా అన్ని రకాల వివక్షతలను నిర్మూలించాలని, అంతం చేయాలని పిలుపునిచ్చారు.

మన భాిష, దుస్తులు, కీర్తనలు, ఇల్లు… ఇలా అన్నీ… మన భారతీయ మూలాలు కలిగి వుండాలన్నీ… చివరికి ఆహారం కూడా మనదే అయ్యి వుండాలని కోరారు. అలాగే మన మాతృభాషలో మాట్లాడటం, స్థానిక దుస్తులే ధరించడం, దేవుళ్లను, దేవతలను స్మరించుకోవడం లాంటివి చేయాలన్నారు.వీటన్నింటినీ ఆచరించడం ద్వారా మన సాంస్కృతిక మూలాలను బలోపేతం చేయవచ్చని, దీని ద్వారా ‘‘స్వ’’ (స్వావలంబన) సాధ్యమవుతుందన్నారు.

భారత్ హిందూ రాష్ట్రమని, దీనికి రాజ్యాంగ ఆమోదం అవసరమే లేదని మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. ఈ భూమిపై చిట్ట చివరి వ్యక్తి వరకూ ఎవరైతే తమ పూర్వీకుల విశ్వాసాలను ఆచరించినంత కాలమూ ఇది హిందూ దేశంగానే వుంటుందని స్పష్టం చేశారు.హిందువులందరికీ దేవాలయాలు, నీటి వనరులు మరియు శ్మశాన వాటికలలో సమాన ప్రవేశం కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. హిందూ సమాజం ఐక్యంగా మరియు బలంగా ఉంటేనే అది ప్రపంచ సంక్షేమం కోసం పనిచేయగలదని మోహన్ భాగవత్ తెలిపారు.