
వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలంలోని ప్రసిద్ధి చెందిన పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయ గోడపై శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్న అరుదైన కుడ్య శిల్పాన్ని గుర్తించినట్లు రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. ‘సాధారణంగా అన్ని చిత్రాల్లో శ్రీకృష్ణుడు నిల్చొని.. కూర్చున్న అర్జునుడికి సందేశమిచ్చినట్లు చూస్తాం. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా శ్రీకృష్ణుడు కూర్చోగా అర్జునుడు నిలబడి ఉన్నారు’ అని పేర్కొన్నారు. కురుక్షేత్ర యుద్ధం చేయడానికి అర్జునుడు సంకోచిస్తున్నప్పుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, భగవంతునిపై భారం వేసి ధర్మం కోసం పోరాడమని శ్రీకృష్ణుడు చెప్పే సన్నివేశాన్ని ఆనాటి శిల్పులు ఎక్కడాలేని విధంగా చెక్కారని వివరించారు. అర్జునుడు శ్రీకృష్ణుడి ఎడమ వైపు నిలబడి, ధనస్సును పట్టుకుని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు శిల్పాన్ని మలిచారని వెల్లడించారు.





