News

చరిత్రను వక్రీకరించారు, దాన్ని సరిదిద్దాలి : వెంకయ్యనాయుడు

222views

ప్రముఖ రచయిత, జర్నలిస్టు, జాతీయవాది శ్రీ వారణాసి రాం మాధవ్ గారు రాసిన ‘మన రాజ్యాంగం-మన ఆత్మగౌరవం’, ‘ముక్కలైన స్వాతంత్ర్యం’ పుస్తకాలు చరిత్రను కళ్లకు కట్టాయని, మరుగునపడిన వాస్తవాలను వెలికి తీశాయని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరుగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవానికి హాజరై శ్రీ రాంమాధవ్ గారు రాసిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ శ్రీ రామ్ మాధవ్ సమకాలీన భారతదేశంలో అగ్రశ్రేణి జాతీయవాద మేధావిగా ఎదిగారని చెప్పారు. బలమైన జాతీయవాద నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన, చిన్న వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్ (RSS) స్వయంసేవక్‌గా ప్రయాణం ప్రారంభించి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగడం ఆయన అంకితభావానికి నిదర్శనమని అన్నారు. ‘ప్రజ్ఞా భారతి’ ఇంగ్లీష్ మాసపత్రిక, ‘జాగృతి’ వారపత్రికల ద్వారా ఆయన చేసిన పాత్రికేయ కృషిని గుర్తు చేశారు.

మన చరిత్రను పాశ్చాత్యులు, కొంతమంది మన దేశానికే చెందిన కుహానా మేధావులు వక్రీకరించారని, దానిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని శ్రీ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాం మాధవ్ గారి పుస్తకాలు అటువంటి ప్రయత్నమే అని చెప్పారు. ‘‘రాజ్యాంగ రూపకల్పనలోని చారిత్రక పరిణామాలను ‘మనరాజ్యాంగం-మన ఆత్మగౌరవం’ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. రాజ్యాంగ పరిషత్ చర్చలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దార్శనికతను ఇందులో ప్రస్తావించారు. 75 ఏళ్లుగా దిశానిర్దేశం చేస్తున్న మన రాజ్యాంగాన్ని అవసరాల మేరకు 100 కంటే ఎక్కువ సార్లు సవరించుకున్నామని, అందులో భాగంగానే మహిళలకు రిజర్వేషన్ కల్పించిన 106వ సవరణ ఒక మైలురాయి ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ సవరణ అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఉదాహరణలను కూడా ఈ పుస్తకం గుర్తు చేస్తోంది. ‘ముక్కలైన స్వాతంత్ర్యం’ పుస్తకంలో దేశవిభజన వెనుక ఉన్న బ్రిటీష్ వలసపాలకుల కుతంత్రాలను, కుహానా చరిత్రకారులు మరుగున పరిచిన వాస్తవాలను రామ్ మాధవ్ గారు ఎంతో పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చారు. జిన్నా వంటి నేతలు రెచ్చగొట్టిన మత విద్వేషాలు, ఆనాడు జరిగిన నరమేధం, మహిళల బలవంతపు మతమార్పిడుల వంటి చేదు నిజాలను ఈ పుస్తకం వివరిస్తోంది.’’ అని చెప్పారు. ఈ రెండు పుస్తకాలను యువతరం తప్పనిసరిగా చదవాలని, అన్ని గ్రంథాలయాల్లో ఉంచాలని సూచించారు.

పుస్తకాలు భాషా సంస్కృతులకు దర్పణాలని, విజ్ఞాన వీచికలని శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నేటి డిజిటల్ యుగంలో ఫోన్లు, ట్యాబ్‌ల వాడకం పెరుగుతున్నా, పుస్తకం పట్టుకుని చదివినప్పుడే మన ‘స్పేషియల్ మెమరీ’ (Spatial Memory) మెరుగ్గా ఉంటుందని వెంకయ్య నాయుడు వివరించారు. పుస్తకంలోని పేజీల స్థిరత్వం వల్ల మనం చదివిన విషయం స్వల్పకాలిక జ్ఞాపకశక్తి నుండి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలోకి వెళ్తుందని, ఇది మస్తిష్కాన్ని చైతన్యవంతం చేస్తుందని అన్నారు. “సమాచారం కోసం గూగుల్ చేయవచ్చు, కానీ విజ్ఞానం కోసం పుస్తకం చదవాల్సిందే” అని ఆయన స్పష్టం చేశారు.”ఊరికొక గ్రంథాలయం-సేవాలయం, ఇంటికొక శౌచాలయం” ఉండాలన్నది తన ఆకాంక్ష అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి పాఠశాలలో లైబ్రరీ ఉండాలని, పిల్లలకు చిన్నతనం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. విజయవాడ పుస్తక మహోత్సవంలోని వివిధ స్టాళ్లను సందర్శించారు. నిర్వాహకుల కృషిని అభినందించారు.