
ఆలయంపై దాడికి వెయ్యేళ్లయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసం
సోమనాథ్.. ఈ పేరు తలచుకుంటే చాలు మన హృదయాలు, మనసులలో సగర్వభావన నిండిపోతుంది. భారత ఆత్మకు ఇదో శాశ్వత ఉద్ఘోషణ. పశ్చిమతీరంలో గుజరాత్‌లో ప్రభాస్ పాటణ్ వద్ద ఈ మహత్తర ఆలయం కొలువైంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. ‘సౌరాష్ట్రే సోమనాథం చ’ అని మొదలయ్యే స్తోత్రం.. తొలి జ్యోతిర్లింగంగా దీనికున్న ప్రాధాన్యానికి ప్రతీక. సోమనాథ్ శివలింగ దర్శనంతో పాప ప్రక్షాళన జరుగుతుందని, మరణానంతరం స్వర్గానికి చేరుతారని ‘సోమలింగం నరో దృష్ట్యా సర్వపాపైః ప్రముచ్యతే! లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్!!’ శ్లోకం మనకు చెబుతుంది. లక్షల మంది భక్తుల నీరాజనాలు అందుకున్న సోమనాథ్‌పై విదేశీ దురాక్రమణదారులు అనేక దండయాత్రలు చేశారు. ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై గజనీ మహమ్మద్ క్రూర, హింసాత్మక దండయాత్ర చేసింది 1026 జనవరిలోనే. ఆలయానికి పూర్వవైభవం దిశగా అప్రతిహతంగా సాగిన కృషివల్ల వెయ్యేళ్ల తర్వాత కూడా ఆలయ దివ్యదీప్తి నేల నలుచెరగులా భాసిల్లుతోంది. ఇలాంటి ప్రయత్నాల్లో ఒక ఘట్టానికి 2026లో 75 ఏళ్లు పూర్తవుతుంది. ఆలయ పునరుద్ధరణ తర్వాత 1951 మే 11న ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో ఆలయంలో భక్తులకు మళ్లీ దర్శనభాగ్యం కలిగింది.
చదివితే హృదయం బరువెక్కుతుంది
సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడి, విధ్వంసాన్ని చారిత్రక గ్రంథాలు సవివరంగా నమోదుచేశాయి. అవి చదివితే మన గుండె చలించిపోతుంది. ఎంతగా హింస, క్రూరత్వం, విషాదం ఉన్నాయనేది ప్రతి వాక్యం చెబుతుంది. అవి కాలంతోపాటు చెరిగిపోనివి. సోమనాథ్‌కు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. మన సమాజానికిది ఎంతో గొప్ప ఆర్థిక బలాన్నిస్తోంది. నౌకావాణిజ్యం చేసేవారు ఈ ఘనతర చరితను సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లారు. తొలిదాడి జరిగిన వెయ్యేళ్ల సోమనాథ్ గాథ దాని విధ్వంసం ద్వారా కాకుండా కోట్లమంది భరతమాత బిడ్డల అచంచల ధైర్యసాహసాల ద్వారా నిర్వచించవచ్చని నేనెంతో సగర్వంగా చెప్పగలను. తొలి దాడి కలిగించిన ప్రేరేపణతో 1026 తర్వాత పలుమార్లు ఈ చారిత్రక ఆలయంపై దాడులు జరిగాయి. మన సంస్కృతిని, ప్రజల్ని బానిసలుగా చేయడానికి అలా బీజం పడింది. దాడి ప్రయత్నం జరిగిన ప్రతిసారీ ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దృఢంగా అడ్డుపడ్డారు. కొందరు ప్రాణత్యాగం చేశారు. 1890లలో స్వామీ వివేకానంద ఈ పుణ్యస్థలిని సందర్శించారు. దక్షిణాదిలోని ఆలయాలు, సోమనాథ్ క్షేత్రం వంటివి మనకెంతో విజ్ఞానాన్ని అందిస్తాయని, పుస్తకాల్లో లేని చరిత్రను చెబుతాయని ఆయన పేర్కొన్నారు. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని తరాలు మారినా ఇలాంటి ఆలయాలు ప్రజల్ని మరింత బలవంతుల్ని చేశాయి. అదే జాతీయ జీవన స్రవంతి ప్రత్యేకత. దానిని అనుసరిస్తే వైభవోపేతంగా ఉంటాం. దానిని వదిలేస్తే మరణమే.
నెహ్రూ విముఖత
స్వాతంత్య్రానంతరం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ పవిత్ర కర్తవ్యం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చేతుల్లోకి వచ్చింది. ఆలయాన్ని అదేచోట తిరిగి నిర్మిస్తామని ఆయన 1947 దీపావళి సమయంలో ప్రకటించారు. 1951 మే 11న ఆలయం తిరిగి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అది చూడటానికి పటేల్ ఈ భూమ్మీద లేరు. మాజీ ప్రధాని నెహ్రూ ఈ ఆలయ పరిణామంపై పెద్ద ఉత్సాహంతో లేరు. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు ఈ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లకూడదని ఆయన కోరుకున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రం దృఢంగా నిలబడ్డారు. సోమనాథ్ ఒక ఆశాదీపం. వెయ్యేళ్ల తర్వాత కూడా సోమనాథ్ వద్ద సాగర కెరటాలు మనకు ఒక విషయాన్ని చెబుతుంటాయి. విద్వేషం, మతమౌఢ్యం అనేవి క్షణకాలం పాటు విధ్వంసం సృష్టించవచ్చేమోగానీ విశ్వాసం, కట్టుబాట్లకు ఉన్న శక్తి శాశ్వతమని అవి ఘోషిస్తుంటాయి. సోమనాథ్ మహదేవుని ఆశీస్సులతో విశ్వమానవ సంక్షేమానికి మనం మున్ముందుకు వెళ్తునే ఉంటాం. జై సోమనాథ్!
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని, శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్





