
కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని బీమేశ్వరస్వామి ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేయడం ద్వారా హైందవుల మనోభావాలు దెబ్బదీశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఆలయంలో వ్యక్తిపై ఉన్న కోపాన్ని ఇలా విధంగా చూపినట్టు గుర్తించారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ శివలింగన్ని ఏర్పాటు చేసి పూజలు జరిపించారని వివరించారు.
ఇక నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవుడి అలంకరణ కోసం వినియోగించే వస్తువులు నకిలీ వెండి వస్తువులని తేలిందన్నారు. వెండి ఆభరణాలు.. ఎలా నకిలీ వస్తువులుగా మారాయనే దానిపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఎండోమెంట్ అధికారులకు ఆదేశించామని గుర్తు చేశారు.
సింహాచలం శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ప్రసాదం తయారీ కౌంటర్లో తప్పు చేసిన వ్యక్తిపై చర్యలకు ఇప్పటికే ఆదేశించామని వివరించారు. ప్రసాదంపై భక్తుల ఆరోపణలకి స్పందించాల్సిన అధికారి.. వారిపై దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు. హిందూ ధర్మం, సనాతన ఆచారాలకు లోటు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆయన హెచ్చరించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత ఏడాది వైష్ణవ ఆలయాలను 5.5 లక్షల మంది భక్తులు దర్శించుకుంటే… ఈ ఏడాది 7.5 లక్షల మంది ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారని గణాంకాలతో సహా వివరించారు. ప్రజల్లో ఆధ్యాత్మికంపై నమ్మకం పెరుగుతుంది. ఇది ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. తిరుమలలో మంగళవారం ఆన్ లైన్ ద్వారా అవకాశం పొందిన 75 వేల మంది ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారన్నారు.





