News

గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు

218views

గిరిజనుల ఆచారం, సంస్కృతికి ‘కంది కొత్తలు’ పండుగ నిలువుటద్దంలా నిలుస్తోందని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని హెచ్‌గ్రౌండ్‌ వద్ద కంది కొత్తల పండగ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ గిరిజనుల ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల జీవన విధానం ప్రకృతితో ఎంతగా ముడిపడి ఉందో ఈ పండగ నిర్వహణను చూస్తే అర్థం అవుతోందన్నారు. తర తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం, ఐక్యతను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరిజనులతో కలిసి నృత్యాల్లో పాల్గొన్నారు. అంతేకాక డప్పు వాయించారు. కలెక్టర్‌ తమ మధ్యకు వచ్చి సామాన్యుడిలా వేడుకల్లో భాగస్వామ్యం అవడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వన దేవతలకు ప్రత్యేక పూజలు
జియ్యమ్మవలస మండలంలోని తూర్పుముఠా ప్రాంతంలో గల టీకే జమ్ము, చినదోడిజ, పెదదోడిజ, కొండచిలకాం, పిటిమండ పంచాయతీ పరిధిలోని గిరిజనులు కందికొత్తల పండగలో భాగంగా వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారోత్సవాల్లో భాగంగా డప్పులు, సాంప్రదాయ వాయిద్యాల నడుమ గిరిజనులంతా ఒక చోటకు చేరుకుని వనదేవతలైన గొడ్డలమ్మ, సాతారమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. పంటలను వనదేవతలకు నైవేద్యంగా పెట్టిన తర్వాత సామూహిక భోజనాలు చేస్తామని గిరిజనులు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలు బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి.