
270views
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అమానుషాలు, అఘాయిత్యాలను యావత్ ప్రపంచం ఖండిస్తోంది. తాజాగా జరిగిన దీపుచంద్ర దాస్ ను కొట్టి చంపడాన్ని కూడా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ హిందూ సంఘాల సభ్యులు లండన్ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ బయట నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులే టార్గెట్ గా ఛాందసులు రెచ్చిపోతున్నారని, మైనారిటీలకు భద్రత కల్పించడంలో అక్కడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విరుచుకుపడ్డారు.
‘‘హిందువులకూ జీవించే హక్కు వుంది. హిందువులే టార్గెట్ గా రెచ్చిపోతున్నారు. హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’’ అంటూ బంగ్లాదేశ్ హిందూ సంఘాలు సభ్యులు నినాదాలు చేశారు. అలాగే ‘హిందువులను రక్షించండి’’ అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులను కూడా ప్రదర్శించారు.బాధితులకు అక్కడి యూనుస్ ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, ఇప్పటి వరకు జరిగిన సంఘటనపై జవాబుదారీ వహించాలని డిమాండ్లు చేశారు.
అలాగే ఇదేమీ యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదని, బంగ్లాదేశ్ లో ఛాందసులు హిందువులే టార్గెట్ గా దాడులకు దిగుతున్నారని, హిందువులపై విస్తృత స్థాయిలో జరుగుతున్న హింసలో భాగమేనని వారు ఆరోపించారు. బంగ్లాదేశ్ లో హిందువులకు, మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోందని, దీనిపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా హిందువులపై జరుగుతున్న దాడులపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని కూడా ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఒత్తిడి తేవాలని కూడా డిమాండ్ చేశారు.





