
రామాయణ, మహాభారతాలు మనిషి ఎలా జీవించాలో తెలిపే మార్గదర్శకాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులో శ్రీ దత్త నాగసాయి ఆనందాశ్రమం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో స్వామిని పూర్వజానంద సరస్వతితో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. భారతమాత చిత్రపటం వద్ద పుష్పాలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి.
మాతా పూర్వజానంద సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇష్టంతో పని చేయాలని తెలిపారు. ప్రతిరోజు భగవన్నామస్మరణతో ప్రారంభించాలని సూచించారు. ప్రతి ఒక్కరు నుదిటిన బొట్టు ధరించాలని సూచించారు. చేసే పనిని ఇష్టంతో చేస్తే ఎంతో శక్తిని పొందుతామని ఆమె సూచించారు. మంచి అలవాట్లతోనే మనిషి ఆలోచన విధానం మారుతుందన్నారు.
ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ.. హిందువులంతా కుల బేధాలను మరచి ఒకటిగా కలిసి ఉండాలన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండి దేశ ఔన్నత్యాన్ని పెంచాలని సూచించారు.

ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు





