
ఒంటిమిట్ట కోదండ రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మరో వసతి భవన సముదాయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడి ముందుకొచ్చింది. కల్యాణ వేదిక స్వాగత తోరణం ఎదురుగా (చెంచుగారిపల్లెకు వెళ్లే దారికి పడమర దిశలో) రామయ్య క్షేత్రానికి చెందిన 1.45 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ నిర్మిస్తే అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ వంద గదులను నాలుగు అంతస్తులతో చేపట్టాలని నిర్ణయించారు. ఒక్కో గది వైశాల్యం 423 చదరపు అడుగులుండేలా ప్రణాళిక రూపొందించారు. రెస్టారెంట్, వంటశాల, సరకుల నిల్వ గది, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, ఉద్యాన వనం అభివృద్ధికి రూ.42 కోట్లు కావాలని ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ దిశగా వచ్చే పాలకమండలిలో ఆమోదానికి దస్త్రం సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో నిర్వహించే శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి కొన్ని గదులను అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.





