
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి
శరన్నవరాత్రి మహోత్సవములలో మంగళవారం శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా,వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి.
ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుతున్నది. సమస్త దేవతామంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీమంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే ఆయా దేవతలకు అన్నాదులు, ప్రసాదాలు నివేదన చేయబడ తాయి. గాయత్రీ అమ్మవారిని దర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీమాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.





