
ఆర్థిక స్తోమత లేని ముస్లిం పురుషుడు ఒకటికన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోరాదని కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి. కున్నికృష్ణన్ స్పష్టంచేశారు. ఖురాన్ కూడా ఇదే నిర్దేశిస్తోందని, దీని గురించి ముస్లింలకు అవగాహన కల్పించాలని సూచించారు.
బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్న 46 ఏళ్ల దివ్యాంగుడైన ముస్లిం నుంచి రూ.10,000 మనోవర్తి కోరుతూ 39 ఏళ్ల మహిళ వేసిన పిటిషన్ మీద హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. తన భర్త నెలకు రూ.25,000 సంపాదిస్తున్నాడని, ప్రస్తుతం అతడు మొదటి భార్యతో కలసి ఉంటున్నాడనీ, అతని నుంచి తనకు మనోవర్తి ఇప్పించాలని రెండో భార్య కుటుంబ కోర్టును ఆశ్రయించింది. ఆ కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయగా ఆమె హైకోర్టుకు అపీలు చేసుకున్నారు.
హైకోర్టు కూడా ఒక బిచ్చగాడు నెలకు రూ.10,000 మనోవర్తి చెల్లించలేడని తేల్చింది. అతడి ఇద్దరు భార్యలకు ఆహారం, దుస్తులు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని సూచించింది. ముస్లింలలో అత్యధికులు ఒకే భార్యతో కాపురం చేస్తారని, కొద్ది మంది మాత్రమే బహుభార్యత్వం ఆచరిస్తారని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.





