News

ప్రధాన స్థావరం ధ్వంసమైందని లష్కరే కమాండర్‌ అంగీకారం

250views

ఇన్నాళ్లూ ఆపరేషన్‌ సిందూర్‌లో తమ పౌరులపై భారత్‌ దాడి చేసిందని పాక్‌ చెబుతున్నవన్నీ కట్టుకథలే అని తేలిపోతోంది. తాజాగా లష్కరే తయ్యిబా-LET టాప్‌ కమాండర్‌ ఒకరు ఈవిషయాన్ని అంగీకరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

దీనిలో లష్కరే కమాండర్‌ ఖాసిమ్‌ మాట్లాడుతూ మే 7వ తేదీన ఆపరేషన్‌ సిందూర్ సందర్భంగా మురిద్కేలో దెబ్బతిన్న ప్రధాన కార్యాలయాన్ని గతంలో కంటే భారీగా నిర్మిస్తామని పేర్కొన్నాడు. ‘‘నేను మురిద్కేలో భారత్‌ జరిపిన దాడిలో ధ్వంసమైన మర్కజ్‌ తయ్యిబా శిథిలాలపై ఉన్నాను. దేవుడి దయ వల్ల గతంలో కంటే భారీగా దీనిని నిర్మిస్తాం’’ అని తెలిపాడు. ధ్వంసమైన భవనంలో గతంలో చాలామంది ముజాహిద్దీన్‌లు (ఉగ్రవాదులు) శిక్షణ పొందినట్లు వెల్లడించాడు. మరో వీడియోలో ఇదే ఉగ్రవాది పాకిస్థానీ యువత ఇక్కడ ఉగ్రశిక్షణ (దౌరా ఇ సుఫా)లో భాగం కావాలని కోరారు. దీనిలో మతం, జిహాదీ శిక్షణ ఇస్తారు.

మరో వీడియోలో లష్కరే డిప్యుటీ చీఫ్‌ సైఫుల్లా కసూరీ మాట్లాడుతూ పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం తమకు ఉగ్రస్థావరాల పునర్‌ నిర్మాణానికి నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసం చేసిన తొమ్మిది ఉగ్ర శిబిరాల్లో మురిద్కే క్యాంప్‌ కూడా ఒకటి. పహల్గాంలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు హత్య చేయడానికి ప్రతీకారంగా భారత్‌ ఈ దాడులు చేపట్టింది.

మరోవైపు పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థలు 2026 ఫిబ్రవరి 5న కశ్మీర్‌లోని సంఘీభావ దినోత్సవంపై దృష్టిపెట్టినట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. అప్పటికల్లా మురిద్కేలోని ఉగ్ర కాంప్లెక్స్‌ను పునర్‌ నిర్మించి సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నిర్మించబోయే భవనమే మరోసారి ఉగ్రశిక్షణ, ఆపరేషనల్‌ ప్లానింగ్‌కు కేంద్రంగా మారనుంది. ఇటీవల జైషే కమాండర్‌ ఇలియాస్‌ కశ్మీరీ కూడా ఓ ప్రసంగంలో మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌లో మసూద్‌ అజర్‌ కుటుంబం చిన్నాభిన్నమైందని అంగీకరించిన విషయం తెలిసిందే.