
అమెరికాలో 31వ జిల్లా టెక్సాస్ నుంచి వాలెంటీనా గోమెజ్ పోటీ చేస్తున్నారు. ఈమె ఒక నినాదంతో బరిలోకి దిగారు. అదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ నినాదం టెక్సాస్ ను ముస్లింలు వదిలి పోవాలి. పైగా పవిత్ర ఖురాన్ ప్రతిని దగ్ధం చేసినట్టు కూడా ఒక వీడియో విడుదల చేసింది. తన ధ్యేయం టెక్సాస్ నుంచి ఇస్లాంను పారద్రోలడమేనని ప్రకటించారు.
ప్రపంచంలో ఉన్న 57 ముస్లిం దేశాలలో ఎక్కడికో ఒక చోటికి వీళ్లంతా పోవాలని (నిజానికి చాలా తీవ్రమైన భాషలో) ఆమె చెప్పారు. ముస్లిం వర్గాలు క్రిస్టియన్ దేశాలను బెదిరిస్తున్నాయంటూ తన వీడియోలో ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు. ‘మనం ముస్లింలను శాశ్వతంగా నిరోధించక పోయినట్టయితే, మీ కూతుళ్లు లైంగిక అత్యాచారాలకు గురి అవుతారు. మీ కుమారుల తలలు తెగుతాయి.’ అని గోమెజ్ హెచ్చరించారు. ఈ మాటల తరువాత ఆమె ఖురాన్ ప్రతికి నిప్పు పెట్టి జీసస్ క్రైస్ట్ ఇచ్చిన బలంతో అని నినదించారు. ఖురాన్ హింసను ప్రేరేపిస్తుందని సామాజిక మాధ్యమాలలో పెట్టిన వీడియోలలో కూడా ఆమె ఆరోపించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో హమాస్ చేసిన ఘాతుకం, 2021లో కాబూల్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు (ఇందులో 13 మంది అమెరికా సైనికులు చనిపోయారు) వంటి అంతర్జాతీయంగా కలకలం సృష్టించిన కొన్ని ఉదంతాలను కూడా గోమెజ్ ప్రస్తావించారు. నా విధానంలో మార్పేమీ ఉండదని, వీటికి కారణమైన పుస్తకానికి నేను విధేయంగా ఉండనని రాశారు. ఫాక్స్ ఇంటూ 26 చానల్ కు (హూస్టన్) ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖురాన్ లైంగిక హింసను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని కూడా అన్నారు. ముస్లింలు యూరప్ వసివాళ్లపై లైంగిక అత్యాచారాలు చేసినా ఏ ఒక్క ముస్లిం దీనిని ఖండించలేదని ఆమె విమర్శించారు. ఎందుకంటే వారి పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్పేదే అదని ఆమె అన్నారు. అవిశ్వాసులపై లైంగిక అత్యాచారాలు చేయమని, వారి గుండెలను ఉగ్రవాద భయంతో నింపమనే చెబుతుందని ఆమె రాశారు. ప్రస్తుతం టెక్సాస్ లో ఒక శాతం ముస్లింలు ఉన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీ వారు కూడా ఖండించారు





