News

సంపూర్ణ నిస్వార్థానికి ప్రతిరూపం మోరోపంత్ పింగ్లే : మోహన్ భాగవత్

243views

సంపూర్ణమైన నిస్వార్థానికి ప్రతిరూపం మోరోపంథ్ పింగ్లే అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.వ్యక్తిగత గుర్తింపు కోసం ఎన్నడూ ప్రయత్నించలేదని, జాతి నిర్మాణం, హిందూ సమాజ పునరుజ్జీవనం కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.

నాగపూర్ కేంద్రంగా మోరోపంత్ పింగ్లే పై రచించిన పుస్తకాన్ని మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పింగ్లేకి వున్న అచంచల నిబద్ధత, ప్రజల విషయంలో ఆయనకున్న దృష్టికోణం, విలక్షణమైన వినయాన్ని మోహన్ భాగవత్ తన ఉపన్యాసంలో ఆవిష్కరించారు.

‘‘మోరోపంత్ పూర్తి నిస్వార్థతకు ప్రతిరూపం. ఆయన ఏమి చేసినా, అది దేశ నిర్మాణానికి ఎలా దోహదపడుతుందో ఆలోచించేవారే. ఈ దృష్టితోనే ఆయన అన్ని పనులూ చేసేవారన్నారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష కూటమి దాదాపుగా 276 సీట్లు గెలుచుకోగలదని పింగ్లే ముందే అంచనా వేశారని, ఆయన అంచనా అంత కచ్చితంగా వుంటుందని గుర్తు చేశారు. ఇంత కచ్చితంగా సీట్లు వచ్చినా.. ఫలితాలు వచ్చిన సమయంలో మోరోపంత్ సజ్జగగఢ్ లో వున్నారని, రాజకీయ సందడికి దూరంగానే వున్నారన్నారు. ఎప్పుడూ క్రెడిట్ కోరుకోలేదని తెలిపారు.

జాతీయ సమైక్యతను ప్రోత్సహించే లక్ష్యంతో గంగాసాగర్ నుంచి సోమనాథ్ వరకు జరిగిన చారిత్రాత్మక ఏకాత్మత రథయాత్రకు పింగ్లే గణనీయమైన సహకారాన్ని అందించారన్నారు. ఆయన ఎక్కడ మాట్లాడినా… ప్రజలు తమ ఉద్వేగం నుంచి విముక్తి పొందేవారని, అంత అద్భుతంగా మార్గదర్శనం చేసేవారన్నారు. ఇక స్వయంసేవకుల నుంచి ఏదైనా ప్రశ్నలడిగితే.. నవ్వుతూ.. ‘‘శాఖకు రండి. ఆటలు ఆడండి… హిందూరాష్ట్ర నిర్మాణానికి అదే దోహదపడుతుంది’’ అని చెప్పేవారని పేర్కొన్నారు.

అలాగే సంస్థాగత వ్యవహారాల్లో కూడా పింగ్లే నిష్ణాతులని, శాస్త్రీయ కార్యకలాపాల్లోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా లోతులు కలిగిన వ్యక్తి అని వివరించారు.అలాగే సరస్వతీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కూడా శాస్త్రవేత్తలతో కలిసి ఆయన చురుగ్గా పరిశోధనలు చేశారన్నారు. అలాగే పింగ్లే వల్ల చాలా మంది ఆరెస్సెస్ లో భాగమయ్యారని, దేశ నిర్మాణాత్మక పనుల్లో కూడా తమవంతుగా చేశారన్నారు. అంతటి సామర్థ్యం పింగ్లేది అని మోహన్ భాగవత్ వివరించారు.