News

పలాస జీడిపప్పుకు జాతీయ గుర్తింపు

364views

సిక్కోలు జీడిపప్పుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఉద్యాన రంగంలో వన్‌ డిస్ట్రిక్ట్‌-ఓడీఓపీ కార్యక్రమంలో భాగంగా ‘జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు (2025) దక్కింది. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్‌ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఘనత జిల్లాకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానరంగానికే ఒక మైలురాయి అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జీడి మామిడి.. ప్రధాన జీవనాధార పంట..
శ్రీకాకుళం జిల్లాలో జీడి పంట ప్రధాన జీవనాధారంగా ఉంది. 24,000 హెక్టార్లలో జీడిమామిడి సాగు అవుతోంది. ఇందులో 22,000 హెక్టార్లు దిగుబడినిచ్చే తోటలే. పలాస, మందస, వజ్రపుకొత్తూరు, సోంపేట వంటి ఉద్దానం మండలాల్లో జీడిమామిడి అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఈ తోటల్లో సంకరజాతి రకాలైన బీపీపీ-8, బీపీపీ-6, వీ-4 వంటి అధిక దిగుబడినిచ్చే రకాలే కాకుండా వంశపారంపర్య జాతులూ ఉన్నాయి. ఈ పంట ద్వారా 1,05,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగాను జీవనం దొరుకుతోంది. వీరిలో సన్నకారు రైతులు 31,000, చిన్న రైతులు 56,000, పెద్ద రైతులు 18,000 మంది ఉన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఈ పంట రైతులకు స్థిర ఆదాయాన్ని కలిగిస్తోంది.

ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు ఊపు
ఉద్యానశాఖ ప్రాసెసింగ్‌ పరిశ్రమల స్థాపనపైనా ప్రత్యేక దృష్టి సారించి ఎంఐడీహెచ్‌, ఆర్‌కేవీవై ద్వారా ఇప్పటివరకు 25 ప్రాసెసింగ్‌ యూనిట్లను ఆధునికీకరించి సబ్సిడీ మంజూరు చేసింది. ప్రస్తుతం 9 యూనిట్లకు నిధుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఎంఎస్‌ఎంఈ డే, కాజూ ఎక్స్‌ పో (పలాస) వంటి కార్యక్రమాల ద్వారా జిల్లాలోని రైతులు, వ్యాపారులు, ప్రాసెసర్లు తమ ఉత్పత్తులను దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసుకున్నారు. ఇది వారికి మార్కెట్‌ అవకాశాలు పెంచడంలో కీలకంగా నిలిచింది. అంతేకాక ఆధునిక ప్యాకింగ్‌, శుభ్రత ప్రమాణాలు, ఎగుమతి సౌలభ్యాలు కలిగిన ప్రాసెసింగ్‌ సెంటర్లు కూడా నిర్మించారు. సాధారణ జీడిపప్పుతో పాటుగా పుదీనా, చిల్లీ, పెప్పర్‌ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన జీడిపప్పు, కాజు బర్ఫీ, వివిధ స్వీట్లు, చిక్కీలు, ఇతర చిరుతిళ్ల తయారీ చేస్తున్న పరిశ్రమలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రాచుర్యం పొందాయి.