News

మా ప్రధానే పిరికివాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం..?: పాకిస్థాన్‌ ఎంపీ

171views

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను చేపట్టిన భారత్‌.. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశం.. భారత్‌పై దాడులకు విఫలయత్నం చేస్తోంది. పాక్‌ దాడులను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థలనూ ధ్వంసం చేశాయి. ఈ పరిణామాలతో పలువురు పాక్‌ ప్రజలు, రాజకీయ నాయకులు అక్కడి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాక్‌కు చెందిన తెహ్రీక్‌ -ఏ- ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఎంపీ షాహిద్ అహ్మద్.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ..తమ ప్రధాని పిరికివాడని, భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేరు పలకడానికి కూడా ఆయన భయపడుతున్నారని అన్నారు. టిప్పు సుల్తాన్‌ చెప్పిన కోట్‌ను ప్రస్తావిస్తూ.. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే, అవి యుద్ధంలో పోరాడలేక ఓడిపోతాయని అన్నారు. అదే విధంగా సరిహద్దుల్లో ఉన్న తమ సైనికులు ధైర్యంగా భారత్‌తో పోరాడాలనుకున్నా.. దేశ ప్రధానికే ధైర్యం లేనప్పుడు వాళ్లు ముందడుగు ఎలా వేయగలరని ప్రశ్నించారు. భారత్‌ దాడి చేసినప్పటి నుంచి ఆ దేశానికి వ్యతిరేకంగా పాక్‌ ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలేదని ఎంపీ దుయ్యబట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో సరిహద్దులో నిలబడి ఉన్న పాకిస్థాన్ సైనికులకు ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తుందని నిలదీశారు.

ఆపరేషన్‌ సిందూర్‌పేరుతో ఉగ్రవాదంపై పోరు తలపెట్టిన భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు పాకిస్థాన్‌ గురువారం రాత్రి దాడులకు దిగింది. అందులో భాగంగా జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్, పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే, భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఉధంపుర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పాక్‌ దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది.