News

రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఆగ్రహం..

407views

నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం ఆలయ ట్రస్టుల నుంచి నిధులు కోరుతోందని ఆరోపించింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజా విమర్శలు వచ్చాయి. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు జైరామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆలయ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ, నిధులను పంపాలని కోరుతోందని ఆరోపించారు. ‘‘ఒక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తోంది, హిందూ వ్యతిరేక కామెంట్స్ చేస్తోంది. మరోవైపు దేవాలయాల నుంచి డబ్బు తీసుకుని ప్రభుత్వ పథకాలకు నడపాలని అనుకుంటోంది. దేవాలయాలు, ట్రస్టులతో సంబంధం ఉన్న వ్యక్తులతో పాటు ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి’’ అని మాజీ సీఎం ఠాకూర్ అన్నారు.

గత నెలలో, రాష్ట్ర సాంస్కృతిక శాఖ రాసిన లేఖలో, ముఖ్యమంత్రి సుఖ్ ఆశ్రయ్ యోజన మరియు ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనకు ఆలయ ట్రస్టులు నిధులు సమకూర్చడానికి మార్గదర్శకాలను వెల్లడించింది. గతేడాది ఆగస్టులో సుఖు ప్రభుత్వం, ఆయన మంత్రి వర్గం జీతభత్యాలను చెల్లించడాన్ని 2 నెలలు వాయిదా వేస్తామని చెప్పింది. దీంతో రాష్ట్రంలోని ఆర్థిక సంక్షోభం స్పష్టంగా కనిపించింది.