
ప్రయాగ్జ్లోని సెక్టార్ 6లో శివ్నగరిలో 7 కోట్ల 51 లక్షల రుద్రాక్షలతో ప్రతిష్టించిన ద్వాదశ జ్యోతిర్లింగాలు పెద్ద సంఖ్యలో భక్తులను, సందర్శకు లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి జ్యోతిర్లింగాన్ని 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, 7 అడుగుల మందంతో నిర్మించడానికి తోడు రుద్రాక్షమాలలతో అలంకరించారు. జ్యోతి ర్లింగాల రూపకల్పనకు అవసరమైన రుద్రాక్షలను దాదాపు 10 వేల గ్రామాల నుంచి సేకరించినట్టు రూపకర్త మౌని బాబా తెలిపారు. బంగ్లాదేశీ హిందువుల రక్షణ, ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు చెప్పారు. మొదటగా ఇనుప లోహంతో శివలింగాన్ని తయారు చేసి, ఆ శివలింగం చుట్టూ రుద్రాక్షలను పేర్చినట్టు తెలిపారు. దాదాపు 37 ఏళ్ల క్రితం రుద్రాక్షలతో జ్యోతిర్లింగాలను ప్రతిష్టించాలని తాను సంకల్పించినట్టు మౌనీ బాబా చెప్పారు. జ్యోతిర్లింగాల ఏర్పాటులో తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో ఏకముఖి నుంచి 26 ముఖాల రుద్రాక్షలను వినియోగించినట్టు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారి అన్నట్టుగా మొత్తం రుద్రాక్షలతో శివనగరిని నిర్మించినట్టు చెప్పారు. ఇక్కడి శివలింగాల్లో ఆరు దక్షిణానికి అభిముఖంగా, మిగిలిన ఆరు ఉత్తర అభిముఖంగా ఉంటాయని తెలిపారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా మహాకాళ్ శివలింగం దక్షిణానికి అభిముఖంగా ఉంటుందని మౌనిబాబా చెప్పారు.
ఏకముఖి, ద్విముఖి రుద్రాక్షలు అరుదుగా లభిస్తుంటాయని, తెల్లరంగులోని త్రిముఖి రుద్రాక్షలు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలల్లో మాత్రమే దొరుకు తుంటాయని తెలిపారు. రుద్రాక్షల ప్రాముఖ్యతను వివరిస్తున్నట్టుగా నాలుగు ముఖాల రుద్రాక్ష పురుషార్థానికి అనుసంధానమైందని, ఐదు, ఆరు ముఖాల రుద్రాక్ష గృహస్తులకు ఉద్దేశించిందని, ఏడు ముఖాల రుద్రాక్ష విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని, ఎవరికైతే ఎనిమిది, తొమ్మిది ముఖాల రుద్రాక్ష సిద్ధిస్తుందో వారి ఇంటి నుంచి అమ్మవారు లక్ష్మీదేవి నిష్క్రమించే ప్రసక్తే లేదని, 10, 11న ముఖాల రుద్రాక్ష వృత్తి, ఉద్యోగాల్లో పురోగతికి ఉపకరిస్తుందని మౌని బాబా చెప్పారు. రుద్రాక్షను కొనుక్కొని ధరించరాదని, ఎవరైనా బహుమతిగా ఇచ్చినప్పుడు మాత్రమే ధరించాలని తెలిపారు.




