
మధ్యప్రదేశ్‌లో చోరీకి గురైన అందమైన శిల్పం, 1960లలో రాజస్థాన్ నుంచి లూటీ చేసిన అమ్మవారి విగ్రహం తదితర 1,400కు పైగా పురాతన వస్తువులను భారత్‌కు అమెరికా అప్పగించింది. రాబోయే రోజుల్లో మరో 600 వరకు ఇలాంటివి రానున్నాయి. భారత్ కాన్సులేట్ జనరల్ మనీష్ కుల్హారీ, హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ న్యూయార్క్ కల్చరల్ ప్రాపర్టీ, ఆర్ట్, యాంటిక్వెట్స్ గ్రూప్ పర్యవేక్షకుడు అలెగ్జాండ్రా డీఆర్మాస్ పాల్గొన్న కార్యక్రమంలో పురాతన వస్తువులను అప్పగించినట్లు మన్‌హటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ ఎల్ బ్రాగ్ జూనియర్ పేర్కొన్నారు. కోటి డాలర్ల (రూ.84 కోట్లు) విలువ గల 1,440 వరకు పురాతన వస్తువులు భారత్‌కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.
1980లో మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయం నుంచి నర్తకి శిల్పం చోరీకి గురైంది. దాన్ని రవాణా చేసేందుకు వీలుగా స్మగ్లర్లు రెండు ముక్కలుగా చేశారు. వాటిని 1992 ఫిబ్రవరిలో లండన్ నుంచి న్యూయార్క్‌కు దిగుమతి చేసుకున్నారు. ఆ శిల్పాన్ని మెట్రోపాలిటన్ మ్యూజియానికి విరాళంగా ఇచ్చారు. దీన్ని 2023లో పురాతన వస్తువుల అక్రమ రవాణా నిరోధక బృందం స్వాధీనం చేసుకునే వరకు ప్రదర్శనకు ఉంచారు. రాజస్థాన్‌లోని తానేసర్-మహదేవ గ్రామం నుంచి దేవతా శిల్పాన్ని చోరీ చేశారు. ఇది 1968 నాటికే మన్‌హటన్ గ్యాలరీలో ఉంది. 2022లో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరముఠాల విచారణలో భాగంగా ఈ పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పురాతన వస్తువుల అక్రమ రవాణా నిరోధక బృందం ప్రకటించింది. పురాతన వస్తువుల అక్రమ రవాణాకు పాల్పడినవారిలో సుభాష్ కపూర్, నాన్సీ వీనర్ తదితరులు కీలకంగా ఉన్నట్లుగా తెలిపింది.




