News

సంస్కృతీ సంప్రదాయాలకు భారత్‌ నిలయం

269views

పురాతన కాలం నుంచి భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా మారి… వసుధైక కుటుంబంగా నిలుస్తోందని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌షిబ్లీ ఆధ్వర్యంలో విజయవాడలోని నిర్వహించిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఆవుల రంగులు వేరైనా పాల రంగు ఒక్కటే. అలాగే మనుషులు వేరైనా మనసులో ఆలోచన విధానాలు ఒకేలా ఉండాలి. ఇతర ప్రాంతాల్లో కొన్ని వ్యత్యాసాలున్నా… ఆంధ్రప్రదేశ్‌లో అంతా మన వారే అనే భావన ఉంది. అదే తరతరాలుగా కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పాకిస్థాన్‌లోని లాహోర్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో.. మాకు ఒకే దేవుడు. హిందువులకు చాలా మంది ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఎన్ని రూపాల్లో పూజించినా దేవుడు ఒక్కడే, ఆరాధన భావాలు ఒక్కటేనని వివరించా. ఇరాక్‌లో సున్నీ, షియా యుద్ధం జరిగినప్పుడు అక్కడికి వెళ్లాను. రెడ్‌జోన్‌ దాటి వెళ్లవద్దని హెచ్చరించినా వెళ్లి వారితో కాసేపు మాట్లాడి శాంతి సందేశం ఇచ్చాను. వారిలో మార్పు వచ్చింది.’ అని గుర్తుచేశారు. భిన్న సంస్కృతులు, మతాలున్నా ఒకే కుటుంబంగా జీవించడం వల్ల ప్రపంచానికి భారత్‌ శాంతి సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ… ప్రసార మాధ్యమాల ద్వారా శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రసంగాలు విన్నానని, ప్రత్యక్షంగా ఇప్పుడు చూడటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సర్వమతాలు ఒక్కటేనని, అందరూ కలిసి రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు