
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిమోర్-లెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్ – కాలర్ ఆఫ్ ది ఆర్డర్’ అందుకొన్నారు. తిమోర్-లెస్ట్ అధ్యక్షుడు రామోస్ హోర్తా ఈ అవార్డును ముర్ముకు అందజేశారు. ప్రజాసేవతోపాటు విద్య, సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత రంగాల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ పురస్కార ప్రదానం జరిగింది. రెండు దేశాల నడుమ స్నేహ సంబంధాలకు ఈ పురస్కారం ప్రతిబింబమని రాష్ట్రపతి ముర్ము ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఫిజీ, న్యూజిలాండ్ పర్యటనలు ముగించుకొని డిలీకి ఆమె చేరుకున్నారు. విమానాశ్రయంలో ముర్ముకు రామోస్ హోర్తా ఘనస్వాగతం పలికారు. అధ్యక్ష భవనంలో గౌరవ వందనం స్వీకరించాక.. రామోస్ హోర్తాతో ఆమె విస్తృత చర్చలు జరిపారు. డిలీలో భారత్ త్వరలో రెసిడెంట్ మిషన్ ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ముర్ము ప్రకటించారు. తిమోర్-లెస్ట్ ప్రధానమంత్రి గుస్మావోతోనూ రాష్ట్రపతి సమావేశమయ్యారు. స్థానిక ప్రవాస భారతీయులతో జరిగిన భేటీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ.. త్వరలో భారత రాయబార కార్యాలయాన్ని అక్కడ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.




