News

బంగ్లాదేశ్‌లో సంఘటితం అవుతున్న మైనార్టీలు..రోడ్లపై నిరసనలు

249views

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందువులు ఆందోళనలు ప్రారంభించారు. మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు సంఘీభావంగా వీధుల్లోకి వస్తున్నారు. తాము ఇక్కడే పుట్టామని, ఇక్కడే చనిపోతామని, ఈ దేశాన్ని విడిచిపెట్టేది లేదంటూ మైనార్టీ వర్గాలు నినదిస్తున్నాయి.

హిందూ జాగరణ్ మంచ్ నాయకత్వంలో హిందువులు మరియు ఇతర మైనారిటీ వర్గాలపై దాడులు, దహనం, దోపిడీలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని షాబాగ్‌లో ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో వేలాది మంది హిందువులు పాల్గొన్నారు. దినాజ్‌పూర్‌లో 4 హిందూ గ్రామాలను తగలబెట్టడం పై తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా మైనారిటీ మంత్రిత్వ శాఖ, మైనారిటీ రక్షణ కమిషన్, మైనారిటీలపై దాడులను నిరోధించేందుకు కఠిన చట్టాలతో పాటు 10 శాతం పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

హిందువులపై దురాగాతాలకు వ్యతిరేకంగా ఠాకూర్‌గావ్‌లో సైతం ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో 4 వేల మందికి పైగా పాల్గొన్నారు. హిందువులకు రక్షణ కల్పిస్తామని ఠాకూర్‌గావ్ సదర్ ఉపజిల్లాకు చెందిన అధికారి హామీ ఇవ్వడం వారు కాస్త శాంతించారు.

బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాల్లో 52 జిల్లాల్లో మైనారిటీలపై అఘాయిత్యాలు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవం ఐక్యత మండలి వ్యాఖ్యానించింది. మైనారిటీలపై 205 అఘాయిత్యాలు జరిగాయని తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మహ్మద్ యూనస్‌కు ఈ సందర్భంగా ఐక్యత మండలి బహిరంగ లేఖలో ఫిర్యాదు చేసింది. మైనారిటీల్లో తీవ్ర ఆందోళన, అనిశ్చితి నెలకొందని, ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేసింది.