
రామాయణంలో వాల్మీకి మహర్షి తన దివ్య ప్రతిభతో మానవత్వ వికాసం పరాకాష్టను అందుకొన్న ఒక భవ్య చిత్రాన్ని తీర్చిదిద్దారు. విశ్వసాహిత్యంలో నిరుపమానమై, విలక్షణమైన స్వర్గసృష్టి అది. భారతీయులు మానవాళికి ప్రసాదించిన ఒక అమూల్యమైన వరం రామాయణం. భౌతిక వైభవ చరమ సీమను అందుకుని, అణ్వస్త్రాలు, కాస్మిక్ కిరణాలు వంటి వినాశకర శక్తులను నిర్మించే పాశ్చాత్య జగత్తు ఎదుట నేడు సైతం భారతవర్షం ఆత్మగౌరవంతో తలయెత్తుకుని నిలబడగలుగుతోంది. దానికి ప్రముఖ కారణం ఇది. భారతవర్షంలో శ్రీరామచంద్రుని వంటి మర్యాదా పురుషోత్తముడు ఉదయించాడు. మహత్తరమైన సాంస్కృతిక పునరుజ్జీవన కార్యాన్ని చేయడానికి సమర్థమైన వాల్మీకి రామాయణం వంటి గ్రంథరాజం రచింపబడింది.
రామాయణానికి వేదాలతో సమానమైన గౌరవం
అతి ప్రాచీన కాలం నుండి రామాయణం గొప్పతనం భారతవర్షంలో గుర్తింపుపొందుతూ వచ్చింది. హిందువులకు వేదాలను మించి పూజ్యము, పవిత్రమైన గ్రంథం లేదు. ప్రాచీనకాలంలో వేదనిష్ఠ ఆర్యజాతిలో సభ్యత్వానికి ఒక అవిభాజ్యమైన లక్షణంగా పరిగణింపబడేది. “భగవంతుడు లేడని వాదించినా పరవాలేదు. కాని వేదాలను అంగీకరించితీరవలసిందే” అనేది ఆర్యజాతిలోని ఒక నియమంగా ఉండేది.
పురాణ వాఙ్మయంలో దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది. కురువంశపు రాజు ప్రతీపునకు దేవాపి, శాంతను అనే ఇద్దరు కొడుకులు. దేవాపి పెద్దవాడు కావడంవల్ల రాజ్యం అతనికే సంక్రమించవలసి ఉంది. కాని అతడు వేదాలను నిందించిన కారణాన అతనికా అధికారం పోయింది. రాజ్యం శాంతనునికి దక్కింది. ఆర్యజాతిలో వేదాలకు ఇంతటి ప్రాముఖ్యం ఉండేది. అట్టి స్థితిలో ఒక గ్రంథాన్ని ‘వేద’మని పిలిస్తే దానికి ఎంత ప్రాముఖ్యం కలుగుతుందో ఊహించ వచ్చు. రామాయణంలోని మంగళాచరణ శ్లోకాలలో ఈ క్రిందిశ్లోకం ఉన్నది.
వేద వేద్యే పరే పుంసి
జాతే దశరతాత్మజే-
వేదః ప్రాచేతపా దాసీత్
సాక్షాత్ రామాయణాత్మ నా॥
వేదాల వల్ల మాత్రమే ఎవరికి జ్ఞానం కలుగుతుందో ఆ పరమేశ్వరుడు దశరథుని పుత్రుడుగా జన్మించాడు. వేదమే ప్రత్యక్షంగా రామాయణ రూపంలో వాల్మీకి ద్వారా అవతరించింది’.
ఈ మంగళా చరణం ఆ తర్వాతి కాలపుది కూడ అయి ఉండవచ్చు. కాని ప్రత్యక్షంగా వాల్మీకి రామాయణంలోనే ఇలా ఉంది.
ఇదమాఖ్యాన మాయుష్యం సౌభాగ్యం పాపనాశనమ్|
రామాయణం వేదసమం శ్రాద్దేషు శ్రావయేద్ బుధః||
ఈ కథ ఆయువును పెంచేది, శుభప్రదమైనది, పాపాలను నశింపజేసేది. ప్రత్యక్షంగా వేదాలతో సమానమైనది కావడంవల్ల శ్రాద్ధక్రియలలో పితరులను తృప్తిపరచడానికి దీన్ని పఠించాలి. రామాయణం అమరత్వం దాని సర్వంకషత్వం, పుణ్యప్రదమైన దాని ధార్మిక మహాత్మ్యం ప్రత్యక్షంగా రామాయణంలోనే వర్ణితమై ఉండడం గమనార్హం. ప్రజాపతియైన బ్రహ్మ వాల్మీకికి కావ్యరచనకు ప్రేరణనిస్తూ ఇలా వరమిస్తాడు.
న తే వా గవృతా కావ్యే
కాచి దత్ర భవిష్యతి
కురూ రామకదాం పుణ్యాం
శ్లోక బద్దా మనోరమామ్
యావత్ సాస్యంతి గిరయ
సరితశ్చ మహితలే
తావ ద్రామాయణ కథా
లోకేషు వ్రతరిష్యతి!
యావద్రామస్యత కథా
త్వత్మృతా ప్రచరిష్యతి
తావ దూర్ధ్వమధశ్చ త్వం
ముల్లోకేషు నివత్స్యనీ (35 నుండి 38 వరకు శ్లోకములు)
-బాలశాస్త్రి హరదాస్





