News

శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో నయన శోభితంగా అలకోత్సవం

267views

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం అలకోత్సవం నయన శోభితంగా జరిగింది. అలసిన శరీరంతో వచ్చిన శ్రీవారిపై అపోహ చెందిన దేవేరులు అలకబూనటం. లోక సంచారంలో జరిగిన సంఘటనలను వివరించి శ్రీవారు బుజ్జగించే ఘట్టం హృద్యంగా సాగింది. ఆలయ సింహ ద్వారానికి దక్షిణ భాగంలోని మంటపంలో అలకోత్సవాన్ని జరిపారు. ఉత్సవ కైంకర్యాలను కంకణ భట్టాచార్యులు నిర్వహంచారు. అలక వహించిన శ్రీదేవి, భూదేవిలు అలసిన శ్రీమన్నారాయణుని శరీరాన్ని చూసి అపోహపడి కినుక వహిస్తారు. అప్పుడు భక్తవత్సలుడు తాను త్రిలోక సంచారంతో రాక్షస సంహారం చేసి వచ్చినట్లు వివరించి దేవేరులను ఊరడిస్తారు. ఈ అలక వహించిన తీరునే అలకోత్సవంగా జరుపుతారు. ఆ ఘట్టాన్ని కంకణ భట్టాచార్యులు భక్తులకు హృద్యంగా వివరించారు. వేడుకకు పురప్రముఖులు, మహిళలు పెద్దసంఖ్యలో హాజరై తిలకించారు. భక్తులకు తీర్థ, ప్రసాదాలను పంచిపెట్టారు.

అశ్వవాహనంపై విహారం..
అలకోత్సవం ముగియగానే శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహుడు అశ్వవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. తిరువీధుల్లో అశ్వవాహనంపై శ్రీవారు కల్కిపురుషుడిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పురజనులు వసంత వల్లభులకు ఫల, పుష్పాలను సమర్పించి, టెంకాయలను కొట్టారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు కాలక్షేపం కోసం నృత్య ప్రదర్శన, హరికథ, బుర్రకథలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.