ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 49 ; పరవస్తు రంగాచార్యులు

322views

కళింగాంధ్రకు చెందిన మొట్టమొదటి జర్నలిస్టుగా పేరుగాంచారు రంగాచార్యులుగారు. ప్రజల్లో నూతన చైతన్యం కలిగించాలనే తలంపుతో సకల విద్యాభివృధ్ధిని అనే వార్తాపత్రికను 1873 లో ప్రారంభించారు. ఆ పత్రిక తొలి కాపీ ఇప్పటికీ రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో భద్రంగా ఉంది. అయితే లండన్ మిషనరీ తన ప్రచురణలు విశాఖపట్నంలో 1804 లోనే ప్రారంభించినప్పటికీ, వాటిలో ఉత్తరాంధ్ర వార్తలు కనిపించేవికావు. తన పత్రికద్వారా విద్య, విజ్ఞానం, సైన్స్ అంశాలను వ్యాప్తి చెందించాలన్న సామాజిక బాధ్యతను స్వీకరించిన రంగాచార్యులు వాటితోపాటు సాహిత్యానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సమయంలోనే కందుకూరి వీరేశలింగం పంతులుగారు తెలుగు జర్నలిజం రంగంలో అడుగుపెట్టి రాజమండ్రి నుండి వివేకవర్ధిని పత్రికను ప్రచురించడం ప్రారంభించారు. రంగాచార్యులుగారి పత్రికలో వెలువడిన వార్తలు మిగతా జిల్లాల పత్రికల్లో కూడా పునర్ముద్రింపబడేవి.

1876 ఫిబ్రవరిలో విశాఖపట్నం ప్రజలు ఎదుర్కొన్న నీటికొరత సమస్యపై వార్తలను రంగాచార్యులు ప్రముఖంగా ప్రచురించారు. అయితే సకల విద్యాభివృద్ధిని చెకరంగా ఆరేళ్లపాటు మాత్రమే ప్రచురితమయింది. కానీ అది ఆ తరువాత వెలువడిన పత్రికలకు మార్గదర్శి అయింది. సంస్కృత, భాష, వ్యాకరణం, వేదాంతం తదితర రంగాల్లో తవహాసభ పండితుడైన రంగాచార్యులు సంస్కృతంలో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాలన్న వారిని లక్ష్యంతో శబ్దార్థ సర్వస్వము అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించి ప్రచురించారు. మహాకవి కాళిదాసు రచించిన శకుంతల నాటకాన్ని తొలిసారి తెలుగులోకి అనువదించినవారు పరవస్తు రంగాచార్యులు. ఆయన పాండిత్యాన్ని గుర్తించిన బ్రిటీషు ప్రభుత్వం 1887లో మహామహోపాధ్యాయ బిరుదునిచ్చి సత్కరించింది. రంగాచార్యులు 1900 సంవత్సరంలో పరమపదించారు.