
( ఫిబ్రవరి 16 – భీష్మాష్టమి )
భీష్ముడు అనగానే ధైర్యసాహసాలకు మారుపేరైన రూపం మెదులుతుంది. తండ్రి కోసం, కొడుకుల కోసం, ధర్మ స్థాపన కోసం జీవితాన్ని ధారపోసిన త్యాగ నిరతుడు భీష్ముడు. ఇచ్ఛామరణ వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆయన కన్నుమూసిన మాఘ శుద్ధ అష్టమిని భీష్మాష్టమి పర్వంగా పేర్కొన్నారు. మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినమని పురోహితులు అంటున్నారు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.దేవతా గణాల్లో అష్టవసువుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వీరిలో ఎనిమదో వసువు పేరు ప్రభాసుడు. ఈ ప్రభాసుడే భీష్ముడిగా జన్మించాడు. గంగాదేవి, శంతన మహారాజు ఎనిమిదో సంతానంగా పుట్టిన ప్రభాసుడికి దేవవ్రతుడు అని పేరు పెట్టారు.
పదహారెళ్ళ పాటు గంగాదేవి దగ్గర పెరిగాడు. సకల విద్యలు అభ్యసించిన దేవవ్రతుడిని శంతనుడికి అప్పగించింది. తండ్రిమీద అభిమానంతో తనకు రావలసిన రాజ్యాధికారాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పదిరోజులు భీకర యుద్ధం చేసి శిఖండి కారణంగా అస్త్ర సన్యాసం చేసి, అర్జునుడి శరపరంపరకు నేలకొరిగాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్య మీద వేచి ఉన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేశాడుఅంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు. ధర్మ పక్షపాతిగా ముద్రపడిన భీష్ముడు పాండవులకు బోధించిన సూత్రాలు.. సర్వకాలాలకూ ఆచరణ యోగ్యాలు.




