News

ఉత్సవాల వేళ అన్న ప్రసాదానికి మంగళం

245views

ఏ ఆలయంలోనైనా పర్వదినాలు, ఉత్సవాల రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం మావుళ్లమ్మ ఆలయ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అమ్మ వారి 60వ వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్న వేళ నిత్యాన్న ప్రసాద వితరణను నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది.

స్థలం లేదని.. ఆలయం ఎదురుగా ఉన్న కార్యాలయ భవనంలో నిత్యాన్నదాన పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న ఉత్సవాలు ప్రారంభమయ్యాక ఈ భవనాన్ని భక్తులకు విక్రయించే పులిహోర ప్రసాదం తయారీకి కేటాయించారు. ఆలయ కళావేదిక వెనుక ఉన్న ప్రసాదం తయారీశాలను సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే కళాకారులకు కేటాయించారు. ఈ క్రమంలో స్థలం లేదనే సాకుతో భక్తులకు అన్న ప్రసాద వితరణను నిలిపి వేశారు. ఉద్యోగులు మాత్రమే ఇక్కడ భోజనం చేస్తున్నారు. మావుళ్లమ్మ దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి దాతలు ఇచ్చిన విరాళాలు రూ.4.73 కోట్ల సొమ్ము బ్యాంకులో డిపాజిట్‌ రూపంలో ఉంది. ప్రతినెలా దీనికి అదనంగా విరాళాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ పథకాన్ని సమర్థంగా నిర్వహించలేకపోవడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించకపోవడమే దీనికి కారణమనే విమర్శలున్నాయి.

ప్రత్యామ్నాయ స్థలం లేకపోవడంతో ఏమీ చేయలేని స్థితిలో అన్నదాన పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. గతంలో ఉత్సవాల రోజుల్లో ఆలయ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలం దాత సహకారంతో పథకాన్ని నిర్వహించాం. ప్రస్తుతం ఆ ప్రాంగణాన్ని మార్పు చేయడంతో అవకాశం లేకపోయింది.
-యర్రంశెట్టి భద్రాజీ, దేవస్థానం సహాయ కమిషనర్‌, మానేపల్లి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి ఛైర్మన్‌