
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు ఆలయం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అయోధ్య రామమందిర ప్రసాదం ఆన్‌లైన్‌లో విక్రయిస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇది కాస్తా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దృష్టికి రావడంతో దీనిపై స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి ప్రసాదాన్ని ఏ ఆన్‌లైన్ మాధ్యమాల్లో విక్రయించట్లేదని స్పష్టం చేసింది. ఇందుకోసం ఏ విక్రేతను, ఏజెన్సీని నియమించుకోలేదని వెల్లడించింది.
‘‘రామాలయ ట్రస్ట్ లాభాపేక్ష లేని సంస్థ. అయోధ్యను దర్శించుకునే భక్తులకు ప్రసాదాన్ని కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉచితంగా అందజేస్తున్నాం. ఇందుకోసం ఎలాంటి ఆన్‌లైన్ సేవలను ప్రారంభించలేదు. ఎవరికీ ఆ బాధ్యతలు అప్పగించలేదు. రామమందిరం, ట్రస్ట్ పేరుతో అలా ఎవరైనా ప్రసాదాన్ని విక్రయిస్తామంటే వాటిని నమ్మొద్దు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని ట్రస్ట్ క్యాంప్ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ ప్రకాశ్ గుప్తా వెల్లడించారు.
ఇటీవల ‘ఖాదీ ఆర్గానిక్’, ‘మందిర్ దర్శన్’ పేరుతో కొన్ని వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో రామమందిర ప్రసాద విక్రయాలు చేపడుతున్నట్లు ప్రకటించాయి. ‘మీ ఇంటికే ప్రసాదాన్ని డెలివరీ చేస్తాం’’ అంటూ ప్రచారం చేశాయి. ఇది నెట్టింట వైరల్ అవడంతో ట్రస్ట్ నేడు స్పష్టతనిచ్చింది.
ఇక, అయోధ్య రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఏలకుల (ఇలాచీదానా) ప్రసాదాన్ని అందించనున్న విషయం తెలిసిందే. దీని తయారీ బాధ్యతను రామ్‌విలాస్ అండ్ సన్స్ దుకాణానికి అప్పగించారు. పంచదార, ఏలకులతో తయారుచేసే ఇలాచీదానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు.




