
459views
శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు మణవాళ మహామునుల తిరునక్షత్రం పూజలు నిర్వహించనున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అయిదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు జరగవని పేర్కొన్నారు. సహస్రనామార్చన, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన, గరుడ వాహన సేవ, నిత్య కల్యాణోత్సవాలను రద్దు చేసినట్లు వివరించారు. స్వామివారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలయంలో సుదర్శన హోమం వైభోవపేతంగా జరపనున్నారు. ఇప్పటివరకు ప్రత్యక్ష విధానంలోనే నిర్వహిస్తున్న ఈ హోమాన్ని ఆదివారం నుంచి పరోక్ష విధానంలో కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన భక్తులకు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వివరించారు.




