
కేరళ రాష్ట్రానిక చెందిన హరిగారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో అగ్ర నాయకులుగా ఎదిగారు. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరిజీ స్వయం సేవక్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వహించారు. సంఘ్ పత్రిక కురుక్షేత్రకు సారధ్యబాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర, జాతీయ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేసిన హరిగారు 1990 నుంచి 15 ఏళ్ల పాటు అఖిల భారతీయ బౌధిక్ ప్రముఖ్‌గా సేవలు అందించారు. ఆసియా, ఆస్ట్రేలియా హిందూ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను పర్యవేక్షించారు కూడా.
మలయాళంలో 43 పుస్తకాలు, హిందీలో 11, ఆంగ్లంలో 2 పుస్తకాలను హరి జీ రాశారు. మలయాళం, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, సంస్కృతం, గుజరాతీ, తమిళం, బెంగాలీ, అస్సామీ భాషలలో ప్రావిణ్యం ఉన్న హరిగారు వివిధ భాషల్లోని అనేక పుస్తకాలను తన మాతృభాషలోకి అనువదించారు. హరిజీ మరణం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరి తన జీవితాంతం మానవత్వం, జాతి నిర్మాణం కోసం కృషి చేశారని తెలిపారు. ఆయన మృతి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
ఆలోచనాపరుడు, ఆదర్శప్రాయుడు, ప్రేమమూర్తి అయిన శ్రీ రంగా హరి జీని కోల్పోవడం తమను ఎంతగానో బాధిస్తోందని పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే జీ విచారం వ్యక్తం చేశారు. ఆయన తన చివరి రోజుల్లో సైతం స్వయం సేవకులకు చదవడం, రాయడం పై ప్రోత్సాహాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. మాట పడిపోయినప్పటికీ తన వద్దకు వచ్చే సందర్శకుల మాటలను శ్రద్ధగా విని తన అభిప్రాయాలను ముఖ కవళికల ద్వారా తెలియజేసేవారని తెలిపారు. స్ఫూర్తిప్రదాత అయిన హరి జీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరపునే కాకుండా వ్యక్తిగతంగా కూడా సంతాపం తెలియజేస్తున్నామని మోహన్ భగవత్ జీ, హోసబలే జీ ప్రకటన ద్వారా తెలియజేశారు. స్ఫూర్తిదాయక జ్ఞాపకంగా తమ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకన్న హరి జీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. హరి జీ మృతికి సంతాపం తెలిపిన వారిలో కేరళ బీజేపీ చీఫ్ కే. సురేంద్రన్ కూడా ఉన్నారు.




