సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, వైభవం అనే అంశంపై విజయవాడ నగరంలో శనివారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి సభాధ్యక్షులుగా వ్యవహరించగా జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు ముఖ్య అతిథిగా, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డీన్ ఫణితి ప్రకాశ్ బాబు, ప్రముఖ రచయిత్రి, వారసత్వ సంపద పరిరక్షక ఉద్యమ కార్యకర్త ఈమని రాణి శర్మ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు.
తెలుగువారికి అపూర్వ చారిత్రక సాంస్కృతిక సంపద ఉందని, సంగీత, సాహిత్య, విజ్ఞాన సహా పలు రంగాల్లో తెలుగువారు ఉన్నత స్థానాలను అలంకరించారని జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు చెప్పారు. ఆ వారసత్వం సంపదను కాపాడుకుంటూనే భావితరాలకు అందించాల్సిన అవశ్యకత ఉందని తెలిపారు. చరిత్ర మనకు దిక్సూచిగా పని చేయగలదని యువతరం విశ్వసించినప్పుడే మన చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని ముందుకు తీసుకువెళ్లగలమన్నారు. చరిత్రను అధ్యయనం చేసే క్రమంలో నేటి తరానికి ‘ఎందుకు’ అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందని కనుక గతం మన భవిష్యత్తుకు దిక్సూచిగా పని చేయగలదనే భావన కలిగించాలని సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్‌కు సూచించారు. ఈ దిశగా మేధో మథనంతో తార్కికమైన జవాబులను సిద్ధం చేసుకుంటే చరిత్రను భావితరాలకు అందించడంలో విజయం సాధించగలమని స్పష్టం చేశారు. శ్రీరాముడిని చూసిన మన జాతి, శ్రవణుడిని చదివిన మన జాతి నేడు తల్లిదండ్రులను ఏకాకులను చేసి వలస పోతోందని..మన సంస్కృతి, విలువలతో కూడిన మన సాహిత్యం, కళలు నేటితరానికి సాంఘీక మార్గదర్శనం చేయగలవన్నారు. మన చరిత్రలో నిగూఢంగా ఉన్న విలువలను మన ముందు తరాలకు అందించగలిగితే ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపగలదని జస్టిస్ యు.దుర్గా ప్రసాదరావు తెలిపారు.
అనంతరం విశిష్ట అతిథిగా పాల్గొన్న తనికెళ్ల భరణి మాట్లాడారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ రాసేదే కవిత్వమని అన్నారు. సామాజిక చైతన్యంతో కవిత్వం రాసినప్పుడు ఆ భావాలు సమాజ హితానికి తోడ్పడతాయనేందుకు వేమన, గుర్రం జాషువా మేలిమి ఉదాహరణలు అన్నారు. శ్రీనాథ కవి సార్వభౌములకు కనకాభిషేకం చేసిన చరిత్ర మనదన్నారు. గుర్రం జాషువాకు గండపెండేరం తొడిగిన జాతి మనదన్నారు. కవి పుంగవుల పాదధూళిని శిరస్సుకు సింధూరంలా ధరించే సదాచారం మన జాతి సొంతమని, ప్రస్తుతం సంధి కాలం నడుస్తోందన్నారు. భాష అందులోని తమాషాను, కవిత్వం దానిలోని రసజ్ఞను నేటి తరానికి పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, వైభవాన్ని ముందు తరాలకు అందించాలని సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ సంకల్పించడం అభినందనీయమన్నారు. సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యమని, సాహితీ ప్రేమికులుగా నేటితరం తయారు కావాలని తనికెళ్ల భరణి పిలుపునిచ్చారు.
ప్రస్తుతం మనం స్థిరమైన అభివృద్ధి అనే పదాన్ని తరచుగా వింటున్నామని కానీ ఆంధ్రుల చరిత్రను గమనిస్తే స్థిరమైన అభివృద్ధిని గతంలోనే సాధించిన విషయాన్ని మనం గమనించగలమని డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఆంధ్రులు బహుముఖ ప్రజ్ఞాశాలురు, ధైర్యధారులు, చైతన్యశీలురు అని వివరించారు. రకరకాల సందర్భాల్లో విడిపోవడం, పరాయి పాలన కారణంగా ఎంతో నష్టపోవడంతో నాటి ఉజ్వలమైన చరిత్ర ముందు తరాలకు తెలియకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. గతంలో మనం సంఘటితంగా లేకపోవడంతోనే పరాధీనులమయ్యామని, ఇదే మన చరిత్ర నేర్పని గుణపాఠం అన్నారు. చరిత్ర, సంస్కృతి పట్ల అవగాహన ఏర్పర్చుకుంటే ఉన్నత స్థితికి చేరుకోవడమే కాకుండా మనోధైర్యం కూడా కలుగుతుందన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా సమాజం మరింత సంఘటితంగా ముందుకెళ్లేందుకు, దేశాన్ని పురోగమాభివృద్ధి దిశగా నడిపేందుకు చరిత్ర-సంస్కృతి దోహదం చేస్తాయని సతీష్ రెడ్డి తెలిపారు.నలుగురిలో కలిసి ఉండడం, కలిసి పని చేయడం వంటి అలవాట్లను మనం అలవరించుకోవడమే కాకుండా ముందు తరాలకు నేర్పించాలని సూచించారు.
ఇక మరో ఆత్మీయ అతిథి ప్రొఫెసర్ ఫణితి ప్రకాశ్ బాబు మాట్లాడుతూ, ‘‘వైజ్ఞానిక వైభవం మన భారతీయుల వారసత్వం’’ అని చెప్పుకొచ్చారు. విదేశీ దండయాత్రల కారణంగా అభివృద్ధి ఆగిపోవడమే కాకుండా చరిత్రపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు. వాస్తవిక చరిత్రను అకళింపు చేసుకోవాలన్నారు. వేర్లు బలంగా ఉంటే ఏ విధంగా చెట్టు బలంగా ఉంటుందో అదే రీతిలో కుటుంబాలు బలంగా ఉంటే సమాజం బలంగా ఉంటుందన్నారు. చరిత్రలోని లోటుపాట్లను సరి చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. మన వేదాల్లోకి తొంగి చూస్తే, ప్రపంచం బట్టలు కట్టని రోజే మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయో నిశితంగా చూడవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత ఉందని..దాన్ని తెలుసుకొని ముందు తరాలకు తెలియజేయాలని సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్‌కు సూచించారు. దేశవిదేశాల్లో ఉన్నతస్థానాల్లో ఉంటున్న తెలుగువారు గ్రామాల అభివృద్ధికి ఉపయుక్తమైన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
తెలుగు ప్రాంతంలో బౌద్ధమతం బుద్ధుని కాలం నుంచే ప్రాచుర్యం పొందిందని ప్రముఖ రచయిత్రి, సామాజికవేత్త ఈమని రాణి శర్మ తెలిపారు. ప్రస్తుత కాలంలో బౌద్ధమతం తన ప్రాభవాన్ని కోల్పోతోందన్నారు. మన ఆంధ్రులు కోల్పోయిన సంస్కృతి, చరిత్రతో పాటు సమస్త మానవాళికి మార్గనిర్దేశం చేసే బౌద్ధ ధర్మాన్ని, తత్వాన్ని నేటి యువతకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈమని రాణి శర్మ తెలిపారు. గత చరిత్ర, సాంస్కృతిక వైభవం గురించి తెలుసుకుంటే వర్తమానంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి స్పష్టం చేశారు. సమస్త మానవాళిని సకారాత్మక భావంతో ముందుకు తీసుకెళ్లేందుకు చరిత్ర-సంస్కృతి ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు, న్యాయకోవిదులు, చరిత్రకారులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.




