
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దౌత్యసిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు న్యూఢిల్లీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. 41 మందిని వెనక్కి రప్పించినట్లు తాజాగా కెనడా వెల్లడించింది. అంతేగాకుండా భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది.
‘41 మంది దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను ఉపసంహరించుకోవడమేనది అనూహ్యమైన చర్య. అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. అయితే కెనడా అదే తరహాలో స్పందించాలనుకోవడం లేదు. పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలనుకుంటోంది. అన్నిదేశాలకు వర్తించే అంతర్జాతీయ చట్టాలను కెనడా సమర్థిస్తూనే ఉంటుంది. అలాగే భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తాం’ అని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వ్యాఖ్యలు చేశారు.




