News

ఇస్రో శాస్త్రవేత్తలను సత్కరించిన ఐఐటీ మద్రాస్‌

365views

ఇస్రో శాస్త్రవేత్తలను ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీఎం) ఘనంగా సత్కరించింది.ఘన విజయాన్ని సాధించిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలైన 12 మంది పూర్వ విద్యార్థులను ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీఎం) ఘనంగా సత్కరించింది. ఇస్రోకు చెందిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లుగా ఉన్న ఐఐటీ విద్యార్థులు, నగరంలోని పలు ప్రభుత్వ, కళాశాలల విద్యార్థులతో ‘ఓవర్‌ ది మూన్‌ విత్‌ టీమ్‌ చంద్రయాన్‌-3’ పేరిట ఐఐటీ ప్రాంగణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సంభాషించారు. సత్కారాలు అందుకున్న వారిలో ఐఐటీ మెకానికల్‌ ఇంజినీరింగు విభాగంలో 2011లో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టర్‌ ఎస్‌.ఉన్నికృష్ణన్‌ నాయర్‌, చంద్రయాన్‌-3 ప్రాజెక్టు డైరెక్టర్‌, విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) డైరెక్టరు డాక్టర్‌ వీరముత్తువేల్‌ కూడా ఉన్నారు. ఈయన ఐఐటీలో 2016లో మెకానికల్‌ ఇంజినీరింగు పూర్తి చేశారు. ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రస్తుతం మెకానికల్‌ ఇంజినీరింగు విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌, డాక్టర్‌ ఎస్‌.ఉన్నికృష్ణన్‌ నాయర్‌ మాట్లాడుతూ.. ఈనెలలో శ్రీహరి కోట నుంచి పెద్ద గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగిస్తామన్నారు. దీన్ని విమాన పద్ధతిలో ప్రదర్శించనున్నామని చెప్పారు. దీనికి కావలసిన ఇతర పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మిషన్లు ఉంటాయన్నారు. తన గురువు పి.చంద్రమౌళి నేతృత్వంలో ఐఐటీలో పీహెచ్‌డీ చేసిన రోజులను నాయర్‌ నెమరు వేసుకున్నారు. చంద్రుడిపై దిగడానికి టీమ్‌ వర్క్‌తోనే సాధ్యమైందని చంద్రయాన్‌-3 ప్రాజెక్టు డైరెక్టరు డాక్టర్‌ వీరముత్తువేల్‌ తెలిపారు. విజ్ఞాన రంగంలో చంద్రయాన్‌-3 ఒక మరుపురాని ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనా ల్యాండర్‌ దిగడానికి వీలుగా కావలసిన సాంకేతికత విధానాన్ని ఉపయోగించామని చెప్పారు.

ఐఐటీ డైరెక్టర్‌, ఆచార్యులు వి.కామకోటి మాట్లాడుతూ.. ‘ఇండిజెనోస్‌ టెక్నాలజీ’ చాలా ముఖ్యమైందని, ఇది మనందరికీ కొవిడ్‌కు బాగా ఉపయోగపడిందన్నారు. రానున్న 25 ఏళ్లలో దేశం మంచి ప్రగతిని సాధిస్తుందని పేర్కొన్నారు. ఇస్రోలో వందలాది మంది ఐఐటీఎం పూర్వ విద్యార్థులు పని చేయడం చాలా ఆనందకరమైన విషయమని ఐఐటీ అలూమ్ని, కార్పొరేట్ రిలేషన్స్‌ డీన్‌, ఆచార్యులు మహేష్‌ పంచగ్నుల పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూషనల్‌ అడ్వాన్స్‌మెంట్ సీఈవో కవిరాజ్‌ నాయర్‌ తదితరులు ప్రసంగించారు.