
ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బర్స్ట్‌తో సిక్కిం రాష్ట్రం కకావికలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన కుంభవృష్టి వర్షం, చుంగ్‌తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా నదిలో నీటిమట్టం పెరగి వరద నీరు ఉప్పొంగి ప్రవహించింది. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సహా వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిర్వీరామంగా గాలిస్తున్నాయి.
పెరుగుతున్న మరణాలు
సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. వరదల్లో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 53కు చేరింది. వీరిలో ఏడుగురు జవాన్లు కూడా ఉన్నారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నదిలో ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 140 మంది ఆచూకీ తెలియడం లేదు. రాష్ట్రంలో 1,173 ఇళ్లు దెబ్బతిన్నాయని, రద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 2,413 మంది ప్రజలను రెస్క్యూ బృందాలు రక్షించినట్లు సిక్కిం ప్రభుత్వం పేర్కొంది.



