

సామాజిక సమరసత వేదిక నెల్లూరు వారి ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరులోని అదితి గ్రాండ్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సమరసత వేదిక ఆధ్వర్యంలో వివాహాలు చేసుకున్న దంపతులతో ఇష్టా గోష్టి కార్యక్రమం జరిగింది. దంపతులకు అరుంధతీ వశిష్టుల చిత్రపటం ఇవ్వడంతోపాటు.. అందరినీ సన్మానించినట్లు సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీధర్ తెలిపారు. దంపతుల అనుభవాలు పంచుకున్న అనంతరం.. పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామి ప్రసంగించారు.. ”ప్రాచీన కాలంలో వర్ణాంతర వివాహాలు, నేడు కులాంతర వివాహాలు ధర్మ సమ్మతమే! కుల వ్యవస్థలో ఉన్న అసమానతలను, ఇతర దోషాలను తొలగించుకోవాలి. తమ తమ కుల వృత్తులు పట్ల చూపిన చిన్న చూపు వల్లే అనేక మందికి ఉపాధి లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య” అని ఆయన పేర్కొన్నారు. ” హిందవః సోదరాహ్ సర్వే” కులాలు ఏవైనా హిందువులం అందరం సోదరులం అన్నది మన విధానం. కులాంతర వివాహాలు సమర్థనీయమే… కులాల హెచ్చు తగ్గులను, అస్ప్రుశ్యతను రూపు మాపి సోదర భావం నిర్మాణం కొరకు సామాజిక సమరసతా వేదిక కృషి చేస్తోందని అన్నారు. నాడు కులాంతర వివాహాలు చేసుకున్న వారి అనుభవాలను విన్నామని.. ఇప్పుడు సన్మానిస్తున్నాం” అని సమరసతా జాతీయ కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో సమరసతా జిల్లా కార్యదర్శి శ్రీ కేశవులు, మహిళా జిల్లా కన్వీనర్ శ్రీమతి రమాదేవి, రాష్ట్ర మహిళా కన్వీనర్ శ్రీమతి కోడూరు జయప్రద, శ్రీ కోడూరు సత్యం తదితరులు పాల్గొన్నారు.





