News

సౌదీలో ఇద్దరు భారతీయుల తలలు నరికివేత

914views

సౌదీ అరేబియా లాంటి దేశాల్లో శిక్షలు ఎలాగుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద తప్పులు ఉంటాయి. ఇక మర్డర్, రేప్ లాంటి నేరాలకైతే మరణశిక్షలే..! అలా ఓ వ్యక్తిని చంపారన్న నేరం రుజువు కావడంతో ఇద్దరు భారతీయలకు మరణశిక్ష విధించింది. వారిద్దరూ చంపింది కూడా తోటి భారతీయుడినే..! సౌదీ అధికారులు భారతీయుల తలలు నరికి మరణశిక్ష విధించిన విషయాన్ని చాలా రోజుల వరకూ ఇండియన్ ఎంబసీకి చెప్పలేదు. అలాగే వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ఇద్దరు భారతీయులకు కోర్టు మరణదండన శిక్ష విధించగా, అధికారులు వారిద్దరి తలలనూ నరికించడం ద్వారా శిక్షను అమలు చేశారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

సౌదీ అరేబియాలో ఉంటున్న పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన సత్వీందర్ కుమార్, లూధియానాకు చెందిన హర్ జీత్ సింగ్ లు మరో భారతీయుడైన ఇమాముద్దీన్ హత్య కేసులో నిందితులు. ఇమాముద్దీన్ హత్య జరిగిన రెండు రోజుల తర్వాత నిందితులిద్దరూ మద్యం తాగి దోచుకున్న డబ్బుల కోసం గొడపడ్డారు. ఈ సమయంలో సౌదీ పోలీసులు సత్వీందర్, హర్జీత్‌లు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సౌదీ నుండి భారత్ పంపే ఏర్పాట్లు చేస్తుండగా ఇమాముద్దీన్ హత్య కేసుతో వీరికి సంబంధం ఉన్న విషయం బయటకు వచ్చింది. దీంతో కేసు నమోదుచేసి నిందితులను రియాద్ జైలుకు తరలించారు. సత్వీందర్ భార్య సీమా రాణి విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేయడంతో అక్కడ భారత రాయబార కార్యాలయంలోని అధికారులు స్పందించారు. మే 31, 2017న జరిగిన కోర్టు విచారణకు భారత విదేశాంగ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమయంలో ఇద్దరు నిందితులూ నేరం చేసినట్టు అంగీకరించడంతో వారికి మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

వీరి కేసు విచారణను ఎంబసీ అధికారులు పరిశీలించారని వెల్లడించిన ఓ అధికారి, కనీసం వారి మృతదేహాలనైనా అప్పగించాలని పలుమార్లు సౌదీని కోరామని, కానీ, మరణదండన విధించబడిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు సౌదీ చట్టాలు అంగీకరించవు. ఫిబ్రవరి 28న వీరికి శిక్ష అమలు జరిగిందని, శిక్షలను అమలు చేసే సమయంలో రియాద్ లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇవ్వలేదని విదేశాంగ శాఖ తెలిపింది.