
బాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి భారీ ప్రచారం లేకుండానే మౌత్ పబ్లిసిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా.. వసూళ్లలో దూసుకుపోతోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. నికర వసూళ్లు రూ.89 కోట్లకు చేరుకున్నాయని పేర్కొంది.
రోజురోజుకూ సినిమాకు ప్రేక్షకాదరణ పెరుగుతుండటంతో కలెక్షన్లు కూడా మరింత పెరుగుతున్నాయి. కలియుగంలో హనుమంతుడి అంశగా భక్తులు భావించే నీమ్ కరోలి బాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.
సినిమా చూసిన ఉత్తరాఖండ్ సీఎం
‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వీక్షించారు. శుక్రవారం సినిమా చూసిన అనంతరం చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఈ సినిమా అందంగా ప్రపంచానికి పరిచయం చేసిందని అన్నారు.
ఉత్తరాఖండ్‌లో పన్ను మినహాయింపు
సినిమాపై సానుకూల స్పందన వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ‘హనుమాన్ అంశ్’కు పన్ను మినహాయింపు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి కోరారు.
భక్తి, ఆధ్యాత్మికతను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా.. తక్కువ బడ్జెట్‌లో రూపొందినప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తుండటంతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.





