ArticlesNews

త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య

6views

(  ఆగస్టు 2 – పింగళి వెంకయ్య జయంతి  )

మువ్వన్నెల జెండా గగనవీధిలో రెపరెపలాడుతుంటే ప్రతీ భారతీయుడి గుండే గర్వంతో ఉప్పొంగిపోతుంది. అలాంటి త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన మహనీయుడు పింగళి వెంకయ్య. గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన పింగళి వెంకయ్య జీవితం ఆదర్శప్రాయం.

పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గర భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంత రాయుడు, వెంకటరత్నమ్మ అనే దంపతులకు జన్మించారు. పెదకళ్ళేపల్లి, చల్లపల్లిలో ప్రాథమిక విద్య అభ్యసించిన వెంకయ్య, మచిలీపట్నం హిందూ పాఠశాలలో హైస్కూల్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. తన 19వ ఏట సైన్యంలో చేరిన వెంకయ్య, దక్షిణాఫ్రికాలో జరిగిన బొయార్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే గాంధీతో పరిచయమైంది. తర్వాత భారతదేశం వచ్చేసిన వెంకయ్య కొంతకాలం బళ్ళారిలో ప్లేగు వ్యాధి ఇనస్పెక్టర్‌గా పని చేసారు. కొన్నాళ్ళకు కొలంబో వెళ్ళి ఆర్థికశాస్త్రం చదువుకున్నారు. కేంబ్రిడ్జి సీనియర్ పరీక్షలో పాసయ్యారు. అక్కడినుంచి లాహోర్ వెళ్ళి డీఏవీ కళాశాలలో సంస్కృతం, ఉర్దూ, జపనీస్ భాషలు నేర్చుకున్నారు. చదువుల పరంగా వెంకయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. భూగర్భశాస్త్రంలో పీహెచ్‌డీ చేసారు, రత్నాల గురించి, ప్రత్యేకం వజ్రాల గురించి పరిశోధక వ్యాసాలు రాసారు. జాతీయోద్యమ సమయంలో పత్తి మొక్కలపై విశేష పరిశోధనలు చేసారు.

దేశాన్ని బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి తప్పించాలనే కాంక్షతో పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకూ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. వందేమాతరం ఉద్యమం, హోంరూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమం వంటి పోరాటాల్లో భాగస్వాములయ్యారు. 1906 సమయం నుంచే వెంకయ్య భారతదేశానికి ప్రత్యేకమైన జాతీయ జెండా కోసం ఆలోచించసాగారు. ఆ యేడాది కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో జాతీయ జెండా గురించి ప్రస్తావించారు. భారతీయమైన పతాకానికి రూపకల్పన చేయడానికి వెంకయ్య అవిరళ కృషి చేసారు. 30 దేశాల జెండాలను సేకరించి అధ్యయనం చేసారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ పేరిట ఆంగ్లంలో ఒక గ్రంథం రచించారు. రకరకాల ప్రయోగాలు చేసి 1921లో కాషాయం, ఆకుపచ్చ రంగులతో, మధ్యలో రాట్నం ఉండేలా జెండాను రూపొందించారు. ఆ యేడాది విజయవాడ కాంగ్రెస్ మహాసభల్లో గాంధీకి తన జెండా నమూనాను అందించారు. గాంధీ సలహా మేరకు జెండాలో తెలుపు రంగుకు కూడా చోటు కల్పించారు. అలా భారత జాతీయ పతాకం తయారయింది. ఆర్యసమాజ్ ఉద్యమకారుడు లాలా హన్స్‌రాజ్ రాట్నం స్థానంలో ధర్మచక్రం ఉండాలని సూచించారు. 1947 జులై 22న జవాహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో తీర్మానం చేస్తూ రాట్నం స్థానంలో ధర్మచక్రం ఉంచాలని ప్రతిపాదించారు. ఆ ఒక్క మార్పు తప్ప పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన జెండాను ఆమోదించారు. ఇవాళ భారతీయ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకం మన తెలుగువాడి కృషి ఫలితం కావడం మనకు గర్వకారణం.

బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్యను జెండా వెంకయ్య, వజ్రాల వెంకయ్య, జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య అని కూడా పిలిచేవారు. ఆయా రంగాల్లో ఆయన కృషి ఎన్నదగినది. దేశానికి స్వతంత్రం వచ్చాక ఆయనను ప్రభుత్వం ఖనిజశాఖకు సలహాదారుగా నియమించింది. 1960, అంటే తనకు 82ఏళ్ళు వచ్చే వరకూ ఆయన ఆ పదవిలో పనిచేసారు. ఐనా చిన్న ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు. ప్రభుత్వం విజయవాడలో ఇచ్చిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుని రోజులు వెళ్ళదీసారు. తన అంత్యకాలంలో దుర్భర దారిద్ర్యం అనుభవించారు. తన చివరి కోరికగా, తాను చనిపోయినప్పుడు తన కళేబరం మీద త్రివర్ణ పతాకం కప్పాలని కోరుకున్న మహనీయుడు పింగళి వెంకయ్య. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎప్పుడు భారత జాతీయ పతాకం ఎగిరినా, దానితో పాటే పింగళి వెంకయ్య కీర్తి పతాక రెపరెపలాడుతూ ఉంటుంది.