News

ఆదంపుర్‌ విమానాశ్రయానికి గురు రవిదాస్‌ పేరు

251views

పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఆదంపుర్‌ విమానాశ్రయం పేరును ‘శ్రీ గురు రవిదాస్‌ మహారాజ్‌ జీ ఎయిర్‌పోర్టు’గా మార్చారు. ఆయన 15 శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ కవి, సంస్కర్త. గురు రవిదాస్‌ జయంతి రోజు ఈ పేరును ఆవిష్కరించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత డేరా సచ్‌ఖండ్‌ బాలన్‌ను సందర్శించారు. గురు రవిదాస్‌ 649వ జయంతి సభలో ఆయన ప్రసంగించారు. ‘అసంఖ్యాక భారత ప్రజలకు ఇది సంతోష ఘడియ. సమానత్వం, దయ, సేవా భావాలను పెంపొందిస్తూ రవిదాస్‌ ప్రవచించిన సందేశం నేటికీ మనలో స్ఫూర్తి నింపుతోంది’ అని మోదీ తన సోషల్‌ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్య్రం సాధించిన ఇన్నాళ్లకు ప్రభుత్వం గురు రవిదాస్‌ ఆశయ సాధనకు పాటుపడటం సంతోషంగా ఉందన్నారు. లుధియానాలోని హల్వారా విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని వర్చువల్‌ పద్ధతిలో ఆయన ప్రారంభించారు.