News

దేశంలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోవడానికి కారణం కార్మిక సంఘాలే :సీజేఐ

268views

దేశంలోని ట్రేడ్ యూనియన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోవడానికి కార్మిక సంఘాలే చాలా వరకు కారణమని అన్నారు. పారిశ్రామికాభివృద్ధిని నిలిపేసి, అనేక సంప్రదాయ పరిశ్రమలను యూసేయడానికి ట్రేడ్ యూనియన్లే ఎక్కువ బాధ్యత వహిస్తాయన్నారు.

అసంఘటిత రంగంలోని ఇంటి పనివారికి చట్టపరమైన రక్షణ కల్పించాలని, కనీస వేతనాల నిబంధనను అమలు చేయాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ… కీలక వ్యాఖ్యలు చేసింది. శాసనాలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తాము ఆదేశించలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి ధర్మాసనం తెలిపింది.

‘‘ఈ కార్మిక సంఘాల వల్ల దేశంలో ఎన్ని పరిశ్రమలు విజయవంతంగా మూసివేయబడ్డాయి? నిజాలు కూడా తెలియలి కదా. చిన్నతనం నుంచీ దేశంలో సంప్రదాయ పరిశ్రమలను చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఈ జెండా సంఘాల కారణంగా అవన్నీ మూతపడ్డాయి. పని చేయడానికి వారు ఏమాత్రం సుముఖత చూపించరు’’ అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.

అనేక మంది ట్రేడ్ యూనియన్ నేతలు పనిని, సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించారని, దీంతో అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. అయితే కార్మిక దోపిడీ వుందని ధర్మాసనం అంగీకరిస్తూనే.. అవగాహన ద్వారానే దీనిని పరిష్కరించాలని సీజేఐ పేర్కొన్నారు. అలాగే దోపిడీ కూడా వుందని, దోపిడీని పరిష్కరించడానికి మార్గాలు వున్నాయని, తమ వ్యక్తిగత హక్కుల గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు.

అలాగే మరో విషయాన్ని సీజేఐ ప్రస్తావిస్తూ.. ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ వ్యక్తులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తారని, దీంత ప్రజలు ఇంటి పనివారిని నియమించుకోవడమే మానేస్తారని, చాలా ప్రధాన నగరాల్లో సర్వీస్ ప్రొవైడర్లే ఈ బాధ్యతలను చేపట్టారని అన్నారు.