
మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లా నిబోరా గ్రామంలో ఒక హిందూ కుటుంబం ముస్లిం యువతికి వివాహం చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. హిందువులతో నిండిన ఈ గ్రామంలో గుడ్డూఖాన్ కుటుంబం ఒక్కటే ముస్లిం వర్గానికి చెందినది. వలస కార్మికులైన గుడ్డూఖాన్ దంపతులు గ్రామం వీడి వెళ్లేటపుడల్లా తమ కుమార్తె నజ్మాను పొరుగున ఉన్న రామరాజ్ యాదవ్ సంరక్షణలో వదిలి వెళ్లేవారు. సొంత బిడ్డలా నజ్మాతో అనుబంధం పెంచుకొన్న రామరాజ్.. గుడ్డూ ఆర్థిక పరిస్థితిని చూసి పెళ్లీడు వచ్చిన ఆమెకు తానే వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం విన్న గ్రామస్థులందరూ మద్దతు పలికి తలో చేయి వేస్తామని ముందుకు వచ్చారు. తేజ్‌గఢ్‌కు చెందిన షాహిద్‌ఖాన్‌తో నజ్మా పెళ్లిని గుడ్డూఖాన్ నిశ్చయించారు. బారాత్ నుంచి నిఖా పూర్తయ్యేదాకా భోజనాలు, బస.. ఇలా గ్రామస్థులు చేసిన ఘనమైన ఏర్పాట్లు చూసి వరుడి బంధువులు నోరెళ్లబెట్టారు. అత్తారింటికి వెళ్తున్న నజ్మాను చూసి గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకోగా.. ‘‘చిన్నప్పటి నుంచీ నా బిడ్డలా పెంచాను’’ అంటూ రామ్‌రాజ్ యాదవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.





