News

తిరుమల తరహాలో.. దుర్గమ్మ ప్రసాదం

196views

ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు అందించే అమ్మవారి ప్రసాదం, అన్నదానంలో మరింత నాణ్యత పెంచడంపై అధికారులు దృష్టిసారించారు. ప్రస్తుతం దుర్గగుడిలో నూతనంగా అన్నదానం, ప్రసాదాల తయారీ భవనాలను కడుతున్నారు. వచ్చే దసరా నాటికి వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. భవన నిర్మాణాలు తుది దశకు చేరుతున్న నేపథ్యంలో.. దుర్గగుడి ఈవో శీనానాయక్‌ ఆధ్వర్యంలో ఓ అధికారుల బృందం.. తిరుమలలో అమలవుతున్న విధానాలను పరిశీలించేందుకు వెళ్లింది.

నిశిత పరిశీలన…: తిరుమల కొండపై లడ్డూ ప్రసాదం తయారీని ఈ బృందం బుధవారం క్షుణ్నంగా పరిశీలించింది. వినియోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడి పదార్థాల నాణ్యత, తయారీ విధానాన్ని పరిశీలించి.. అక్కడి సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. అన్నప్రసాదం తయారీ, భోజనశాల విస్తీర్ణం, భక్తులకు సౌకర్యాలు, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుకుంటున్నారు, వడ్డించే ఉత్తమ విధానాలు.. అన్నీ తెలుసుకున్నారు. తిరుమల ఇంజినీరింగ్‌ అధికారులు.. అక్కడి అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని విజయవాడ బృందానికి అందజేశారు.

ఇప్పటికే భవనాలు కట్టేడయంతో..: దుర్గగుడి ప్రాంగణంలోని కనకదుర్గానగర్‌లో ఇప్పటికే ప్రసాదాల తయారీ, అన్నదాన భవనాలను 80 శాతంపైగా కట్టేశారు. తిరుపతి తరహాలో ఇక్కడ అధునాతన సాంకేతిక విధానంలో యంత్ర పరికరాలను పెట్టాలంటే.. భవన నిర్మాణం ఆరంభించడానికి ముందే పక్కాగా ప్రణాళిక ఉండాలి. ప్రస్తుతం అక్కడి విధానాలను ఎలా ఇక్కడ అమలు చేస్తారనేది.. వేచిచూడాలి. అన్నదానం, ప్రసాదాల తయారీ కోసం ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌లు తాజాగా సూచించడంతో.. తాము తిరుమలకు వెళ్లామని ఈవో శీనానాయక్‌ తెలిపారు. భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ప్రసాదాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. పర్యటనకు వెళ్లిన బృందంలో.. ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్‌బాబు ఉన్నారు.