News

అన్ని కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఏకాత్మ మానవ సిద్ధాంతం : కిషన్ రెడ్డి

241views

స్వదేశీ విధానాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధ్యాన్యమిస్తుందని కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. విజయవాడలో 1965లో జరిగిన జనసంఘ్‌ మహాసభల స్మృతులను గుర్తు చేసుకునేలా ఈరోజు (23-01-26), రేపు( 24 -01-26) ఏకాత్మ మానవ దర్శన్‌ జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి కూడా పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన “60 వసంతాల ఏకాత్మ మానవ దర్శన్‌ పునఃస్మరణ” సదస్సు కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బిజెపి జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్, పార్టీ సీనియర్‌ నేత రామ్‌ మాధవ్, చరిత్రకారుడు ముదిగొండ శివప్రసాద్
పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భారతీయ మూలాలు, ఆలోచనలకు అనుగుణంగా ఏకాత్మ మానవతా వాదం ఉంటుందని పేర్కొంటూ, ఈరోజు చాలా పవిత్రమైన రోజు అని బీజేపీ ఏకాత్మ మానవ దర్శన పునఃస్మరణ సదస్సులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఆచరణ సాధ్యం కాని సిద్ధాంతాలను ఆ నాటి పాలకులు భారత్​పై రుద్దారని ఎద్దేవా చేశారు. కేపిటలిజం, కమ్యూనిజం ప్రపంచానికి ముఖ్యం అని మాట్లాడుకునే సమయంలో దీనదయాళ్ ఏకాత్మ మానవ వాదాన్ని తీసుకొచ్చారని కిషన్​ రెడ్డి గుర్తు చేసారు. గత 12 సంవత్సరాలుగా భారత్ ఏకాత్మ మానవ వాదంలో, నరేంద్ర మోదీ పాలనలో ఉందని కిషన్​ రెడ్డి వెల్లడించారు. ప్రపంచ దేశాలన్నీ అనేక సంక్షోభాలతో ఉంటే, మన దేశంలో ఏ రకంగా పరిపాలన జరుగుతోందో దేశ ప్రజలందరూ నేరుగా చూడాలన్నారు. కమ్యూనిజం అంటున్న చైనాలో కూడా వ్యక్తికి స్వేచ్ఛ లేదని ఆయన తెలిపారు.

కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కకు పెట్టి : సామాజిక బాధ్యత, ఆర్ధిక రాజకీయ వికేంద్రీకరణ కేపిటలిజం, కమ్యూనిజంలో లేదని కేెంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. పాశ్చాత్య ఆలోచనా విధానాలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కకు పెట్టి ఏకాత్మ మానవ సిద్ధాంతం వచ్చిందని అన్నారు. 1986వ సంవత్సరంలో విజయవాడలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగిందని, ఆ సన్నివేశాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అంత్యోదయ కార్యక్రమంలో 12 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇచ్చారని వెల్లడించారు. రోడ్ల పక్కన వ్యాపారాలు చేసే వారికి ప్రధానమంత్రి స్వానిధి కింద చేయూతనిస్తున్నారని కిషన్​ రెడ్డి తెలిపారు. దాదాపు 56 కోట్ల మంది పేదలకు జనధన్ అకౌంట్ ఇచ్చారని తెలిపారు. పేద ప్రజలకు అందరికి న్యాయ జరగాలని ఆయన ఆకాంక్షించారు.

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఇంటిగ్రల్‌ హ్యూమనిజం సిద్ధాంతాన్ని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్షించడం, భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం ఈ రెండు రోజుల సదస్సు ప్రధాన లక్ష్యాలుగా బీజేపీ నిర్ణయించింది. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సదస్సులో చర్చలు జరగనున్నాయి. సదస్సు ప్రాంగణంలో కేంద్రంలో బీజేపీ పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయనున్నారు.