News

స్వామి వివేకానంద బోధనలు యువతకు దిక్సూచి

205views

స్వామి వివేకానంద బోధనలు యువతకు దిక్సూచి వంటివని, ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని హర్యానా మాజీ గవర్నర్‌, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంత్యుత్సవం-2026 కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దత్తాత్రేయతో పాటు ఇండియన్ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర చైర్మన్ వై.డి.రామారావు, అంబాత్రయ క్షేత్ర వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామీజీ, రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి పరిజ్ఞేయనందాజి మహరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ​ముందుగా వివేకానంద సెంటర్ వద్ద ఉన్న స్వామివారి విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం దుప్పలపూడిలోని ఆర్.బి.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభా కార్యక్రమంలో సమాజానికి విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. బండారు దత్తాత్రేయ, వై.డి.రామారావు, కనకరాజు గురుస్వామిలకు ‘జీవన సాఫల్య పురస్కారాలను’, ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మహరాజ్‌కు ‘స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు’ను స్వామి పరిజ్ఞేయనందాజి మహరాజ్ అందజేసి ఆశీస్సులు అందించారు. సేవా భవాని అలవర్చుకుని సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.