News

ధర్మ రక్షా సభకు అనుమతిచ్చిన తెలంగాణ హైకోర్టు

196views

బాలాపూర్‌లో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించ తలపెట్టిన ధర్మ రక్షా సభకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందనే సాకుతో పోలీసులు సభకు అనుమతి ఇవ్వడం లేదని.. అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలని గణేశ్‌ ఉత్సవ సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదిస్తూ.. హైదరాబాద్‌ బాలాపూర్‌ ఏరియాలో భారీఎత్తున రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపాలనే డిమాండ్‌తో సభ తలపెట్టామని, అనుమతి కోసం ఈ నెల 9న దరఖాస్తు పెడితే ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు.

హోంశాఖ తరఫున న్యాయవాది వాదిస్తూ.. బాలాపూర్‌ మతపరంగా సున్నిత ప్రాంతమని, 6,993 మంది రోహింగ్యాలు 26 క్యాంపుల్లో నివాసం ఉంటున్నారని, సదరు క్యాంపుల వద్దే సభ పెట్టడం సరికాదని పేర్కొన్నారు.

ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. బాలాపూర్‌లో ఉంటున్న రోహింగ్యాల చట్టబద్ధమైన నివాస స్థితి ఏంటి? అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. వారికి శరణార్థి హోదా లేదని, అక్రమ వలసదారులని జవాబిచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ధర్మరక్షా సభకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3 వేల మందితో సభ పెట్టుకోవచ్చని, రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా చూసుకోవాలని పేర్కొంది.